అమెరికాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత వారంతో పోల్చితే బాధితుల సంఖ్య 6శాతం మేర తగ్గినట్లు వెల్లడించారు. పాజిటివ్ రేటు కూడా 8.7 శాతం నుంచి 8 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. మహమ్మారిపై పోరులో పురోగతి సాధించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికాలోనే పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు ట్రంప్.
" ప్రపంచంలోని ఉన్నత దేశాల్లో కరోనా కట్టడిలో అమెరికానే మెరుగైన స్థానంలో ఉంది. 18 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు 6కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. మరే ఇతర దేశం ఈ దారిదాపుల్లో కూడా లేదు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న భారత్ ఇప్పుడు అసలు సమస్యను ఎదుర్కోనుంది. చైనాలో కూడా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ మళ్లీ విజృంభిస్తోంది."