US COVID CASES: కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆరు రెట్లు పెరిగిపోగా.. మొత్తం కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉన్నాయి. కరోనా బాధితుల్లో మరో 1811 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
US Omicron cases
ఒమిక్రాన్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉచితంగా 50 కోట్ల ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. బూస్టింగ్ డోసులు, రీడబుల్ వ్యాక్సినేషన్ కోసం ఆస్పత్రులకు మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు. టీకాలు వేయించుకోవడం అమెరికన్లకు దేశభక్తితో కూడిన బాధ్యత అని ఉద్ఘాటించారు బైడెన్. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బూస్టర్ డోసు తీసుకున్నారని గుర్తు చేశారు.
Joe Biden Omicron
"వ్యాక్సినేషన్ తీసుకోవడం అందరి బాధ్యత. టీకా తీసుకోనివారిపై ఒమిక్రాన్ ప్రమాదకరమైన ప్రభావం చూపుతోంది. వైరస్‌పై పోరాడి మనందరం అలసిపోయాం. దీనికి ముగింపు లభించాలనే కోరుకుంటున్నాం. కానీ మహమ్మారి ఇంకా అంతం కాలేదు. అయితే, ఇంతకు ముందుతో పోలిస్తే మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. దీన్నుంచి మనం బయటపడతాం."
-జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు
నో లాక్డౌన్!
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ నగరంలో ఆంక్షలు విధించే అవకాశం లేదని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో స్పష్టం చేశారు. ఇకపై లాక్డౌన్లు ఉండవనే తాను భావిస్తున్నానని తెలిపారు. టైమ్స్ స్క్వేర్‌లో కొత్త సంవత్సర వేడుకల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతేడాది, ఆంక్షల మధ్యే వేడుకలు జరగ్గా.. ఈసారి పూర్తిస్థాయిలో నిర్వహించాలనే అనుకుంటున్నామని మేయర్ అన్నారు.
న్యూయార్క్ మేయర్‌గా దిగిపోనున్న బ్లాసియో స్థానంలో జనవరి 1 నుంచి ఎరిక్ ఆడమ్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సైతం నగరంలో లాక్డౌన్ విధించే నిర్ణయం తీసుకోరని సంబంధిత వర్గాలు తెలిపాయి. రోజూవారీ వ్యవహారాలకు ఇబ్బందులు కలగకుండా పాక్షిక ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.
Britain Covid cases
అటు, ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిటన్ విలవిల్లాడుతోంది. 90,629 వేల కేసులు బయటపడ్డాయి. ఇందులోనూ చాలా వరకు కొత్త వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నాయని అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో 172 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 11,542,143కు పెరిగింది. మరణాల సంఖ్య 147,433కు ఎగబాకింది.
వెనుకబడిన ప్రాంతాల్లోనే వ్యాప్తి!
బ్రిటన్‌లో అన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఒకేలా లేదని తాజా అధ్యయనంలో తేలింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఒమిక్రాన్ మరింత ప్రమాదకరంగా ఉందని వెల్లడైంది. వెనుకబడిన ప్రాంతాల్లో తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో నమోదైన మరణాలతో పోలిస్తే.. ప్రస్తుతం రెండున్నర రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించాయని పరిశోధకులు వెల్లడించారు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లేకపోవడం, ఇరుకైన ప్రదేశాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నివసించడం, తగిన గాలి సరఫరా(వెంటిలేషన్) లేకపోవడం, వైద్య సదుపాయాల లేమి వంటి కారణాల వల్ల ఒమిక్రాన్.. ఈ ప్రాంతాల్లో ప్రబలుతోందని తెలిపారు. కరోనాకు ముందు నుంచే ఈ ప్రాంతాలు తీవ్రమైన అసమానతలు ఎదుర్కొన్నాయని.. మహమ్మారి దీన్ని మరింత పెంచిందని చెప్పారు.
బూస్టర్ డోసులే కీలకం
బూస్టర్ డోసుల వల్ల కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకత మెరుగవుతున్న నేపథ్యంలో.. అందరికీ అదనపు డోసులు అందించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసులు ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని తెలిపారు. అయితే, టీకా విషయంలోనూ వెనకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని, ఆ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు.
ఇతర దేశాల్లోనూ..
- ఫ్రాన్స్‌లోనూ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. మరో 72,832 కేసులు నమోదు కాగా.. 229 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది.
- రష్యాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. మరో 1027 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 299,249కు చేరింది. కొత్తగా 25,907 కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 10,267,719కు పెరిగింది.
ఇదీ చదవండి:3 నెలలకే తరుగుతున్న... కొవిషీల్డ్ టీకా రక్షణ!