US Covid Death Toll: కరోనా కారణంగా అమెరికాలో మరణాల సంఖ్య మంగళవారం 8 లక్షలకు చేరుకుంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య అట్లాంటా, సెయింట్ లూయిస్ జనాభాతో సమానం.
ప్రపంచంలో అమెరికా అత్యధిక మరణాల సంఖ్యను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన 5.3 మిలియన్ల మరణాలలో 15 శాతం మరణాలు కేవలం అమెరికాలోనే నమోదయ్యాయి. అయితే.. అధికారికంగానే ఇలా ఉంటే ఇంకా లెక్కలోకి రాని కరోనా మరణాలను కలుపుకుంటే ఈ గణాంకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. 2020, మార్చి 1 నుంచి అమెరికాలో 8,80,000 మరణాలు నమోదయ్యాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఓ నివేదికలో తెలిపింది.
'కరోనా మరణాలు తగ్గించగలిగేవే.. కానీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగలేదు.' అని జాన్స్ హాకీన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ క్రిస్ బేరర్ అన్నారు. మొదట వ్యాక్సిన్ పంపిణీ మొదలైనప్పుడు దేశంలో మరణించిన వారి సంఖ్య దాదాపు 3,00,000 వద్ద ఉంది. కానీ ఇది జూన్ వరకే 6 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ యూఎస్‌లో విస్తరిస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పటికీ తెలియదని చెప్పారు.
Corona Deaths in Brazil:
అమెరికా తర్వాత కరోనా మరణాలు అధికంగా నమోదైంది బ్రెజిల్‌లోనే. ఇప్పటికే మృతుల సంఖ్య 6,00,000 దాటింది. కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ముఖ్యంగా రెండో దశలో బ్రెజిల్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు వెలుగుచూశాయి. ఆసుపత్రులు సరిపోక మృతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం టీకా పంపిణీ వేగవంతం చేసినందున కొంత మేర అదుపులోకి వచ్చింది. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఆ దేశం సన్నద్ధం అవుతోంది.
Mexico Covid Death Toll:
అతి ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో మెక్సికో కూడా ఒకటి. ఇప్పటికే ఈ దేశంలో 2,90 వేల కంటే ఎక్కువగానే కరోనా మరణాలు సంభవించాయి. అధికారిక లెక్కలే ఇలా ఉంటే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా.
UK virus deaths:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశం యూకే. ఇప్పటికే మరణాల సంఖ్య దాదాపు 1,50 వేలకు చేరుకుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఈ దేశంలో విజృంభిస్తోంది. రోజుకు 50 వేల పైనే కేసులు వెలుగుచూస్తున్నాయి.