US record covid cases: అమెరికాలో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై ఏడాది దాటినా.. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. కొత్త కేసుల సంఖ్య రోజుకో రికార్డు స్థాయిని నమోదు చేస్తోంది. వరుసగా రెండో రోజు నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులోనే 4,65,449 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. 1,674 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య.. 54,656,645కు చేరింది. మరణాల సంఖ్య 844,169కు పెరిగింది.
US weekly covid update
రెండు వారాల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య రెట్టింపునకు మించి పెరిగింది. సిబ్బంది కొరతతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పండగ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడింది. అయితే, వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోవచ్చని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మించి గుమిగూడే వేడుకలు వద్దన్నారు.
సుమారు 60వేల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సీడీసీ తెలిపింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఈ సంఖ్య సగమేనని వెల్లడించింది. వ్యాక్సినేషన్ పరిధి పెరగడం, ఒమిక్రాన్ వల్ల బాధితులకు ముప్పు అధికంగా లేదనేందుకు ఇదే ఉదాహరణ అని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపింది.
ఐరోపాలో సునామీ..
ప్రపంచవ్యాప్తంగానూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించినట్లుగా.. ఈ ప్రాంతంలో కరోనా.. సునామీలా విరుచుకుపడుతోంది. ఫ్రాన్స్, గ్రీస్, బ్రిటన్, స్పెయిన్ దేశాలు రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదు చేశాయి.
France covid cases: ఫ్రాన్స్‌లో 208,099 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం నమోదైన లక్షా 80 వేల కేసులే ఇప్పటివరకు అత్యధికం కాగా.. 24 గంటల వ్యవధిలోనే ఆ రికార్డు బద్దలైంది. ఫ్రాన్స్‌లోనే కాక, ఇతర ఐరోపా దేశాల్లో ఒకరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవేనని ఫ్రెంచ్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ తెలిపారు. 'ప్రతి సెకనుకు ఇద్దరి కంటే ఎక్కువ మందికి కొవిడ్ సోకుతోంది. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇదివరకు లేదు. డెల్టా వేరియంట్ కారణంగా ఇప్పటికే వైద్య వ్యవస్థపై ఒత్తిడి పడింది' అని అన్నారు.
- UK covid cases today: బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 83 వేల కేసులు నమోదయ్యాయి. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- Spain covid cases update: స్పెయిన్‌లో ఒక్కరోజే లక్ష కరోనా కేసులు బయటపడ్డాయి. 78 మంది కరోనాతో మరణించారు. పది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- Italy covid cases: ఇటలీలో 98 వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,854,428కు పెరిగింది. మరణాల సంఖ్య 137,091కు చేరుకుంది.
ఇదీ చదవండి:ప్రపంచంపై మరోసారి కరోనా పంజా- వారంలోనే 11% పెరిగిన కేసులు