US covid cases: అమెరికాలో కరోనా విలయం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,27,605 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 1544 మంది ప్రాణాలు కోల్పోయారు. 104,606 మంది కోలుకున్నారు.
World Covid cases
ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 8,85,052 కేసులు వెలుగులోకి వచ్చాయి. 7,220 మంది ప్రాణాలు కోల్పోయారు.
Omicron USA cases
కేసుల వ్యాప్తి నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో మాస్కు తప్పనిసరి అనే నిబంధనను అమలులోకి తెచ్చారు. రెస్టారెంట్లు, బార్లు, నైట్ క్లబ్‌లు, జిమ్‌లలోకి వెళ్లే 12 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధన జనవరి 15 నుంచి అమలవుతుందని చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని విద్యార్థులందరూ మార్చి 1లోపు రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేశారు. బూస్టర్ డోసులు తీసుకోవాలని సిఫార్సు చేశారు. అయితే, దీన్ని తప్పనిసరి నిబంధనల్లో చేర్చలేదు. చర్చిలు, కిరాణ దుకాణాలు, అవుట్డోర్ స్టేడియాల్లోకి టీకా తీసుకోకపోయినా అనుమతిస్తారు.
UK covid cases!
యూకేలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్త కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 147,573కు పెరిగింది.
ఈ నేపథ్యంలో చిన్నారులకు టీకాలు అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది యూకే వైద్య ఏజెన్సీ. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఫైజర్ మినీ టీకాను అందించాలని నిర్ణయించింది. రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి, వైరస్ బాధితులకు దగ్గరగా మెలిగిన వారికి ముందుగా టీకా ఇవ్వాలని సూచించింది. 16-17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లకు, 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న అధిక రిస్కు గల పిల్లలకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పెద్దలకు ఇచ్చే టీకాలో మూడో వంతును పిల్లలకు ఇస్తారు. ఎనిమిది వారాల వ్యవధిలో రెండు డోసులు పంపిణీ చేస్తారు.
అయితే, దేశంలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొత్త ఆంక్షలు సైతం ఉండబోవని స్పష్టం చేశారు.
ఫ్రాన్స్‌లో 84 వేల కేసులు
ఫ్రాన్స్‌లోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. 84,272 కేసులు వెలుగులోకి వచ్చాయి. 170 మంది వైరస్ తీవ్రతకు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 8,798,028కు పెరిగింది.