హెచ్-1బీ వీసా జారీ విషయంలో కీలక తీర్పును వెలువరించింది అమెరికా కోర్టు(h1b visa latest news). ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని పక్కనపెట్టి.. వేతనాల ఆధారంగా వీసాలను ఎంపిక చేయాలన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేసింది.
ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన నిబంధన విషయంలో నాటి ఆపద్ధర్మ హోంమంత్రి చాడ్ ఓల్ఫ్.. తన విధులను చట్టబద్ధంగా నిర్వర్తించలేదని కాలిఫోర్నియాలోని జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ ఎస్ వైట్ పేర్కొన్నారు. అందువల్ల ట్రంప్ కాలం నాటి ప్రతిపాదనను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు(h1b visa lottery).
అమెరికాలో పనిచేసేందుకు విదేశీయులకు ఇచ్చేదే ఈ హెచ్-1బీ వీసా. భారత్, చైనా వంటి దేశాల నుంచి.. వేలాది మంది సాంకేతిక నిపుణులను అమెరికా టెక్ సంస్థలు ప్రతి ఏటా తీసుకుంటాయి. అయితే ఏడాదికి 65వేల వీసాలే జారీ చేస్తారు. అదనంగా మరో 20వేల వీసాలు రిజర్వులో ఉంటాయి. ప్రస్తుతం.. 'ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్'(ముందువచ్చిన వారికి వీసా)- 'లాటరీ' విధానాలను కలగలిపి వీసాలు జారీ చేస్తున్నారు(h1b visa lottery system).