హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఇచ్చే హెచ్-4 వీసాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది అగ్రరాజ్య కోర్టు. ఈ వీసాల ప్రస్తుత స్థితిపై మార్చి 5వ తేదీ లోపు ఉమ్మడి నివేదిక ఇవ్వాలని సంబంధిత విభాగాలను కోరింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-4 వీసాలపై తీసుకున్న నిర్ణయాలని ఉపసంహరిస్తున్నట్లు బైడెన్ పాలక వర్గం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని ఉద్యోగాలను కాపాడాలని కోరుతూ 2015 నిబంధనను సవాల్ చేస్తూ ఫెడర్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా ఇమ్మిగ్రేషన్ విభాగాలకు లేఖ రాశారు యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ జడ్జి తన్య ఎస్ చుత్కాన్.
" ఇటీవలి కార్యనిర్వాహక, పరిపాలన నిర్ణయాల మేరకు.. సంబంధిత విభాగాలు సమావేశమై మార్చి 5వ తేదీలోపు ఉమ్మడి స్టేటస్ నివేదికను సమర్పించాలి. 1. ప్రస్తుత వివాదం పరిష్కారమైందా లేదా పార్టీలు పరిష్కారమైనట్లు భావిస్తున్నాయా? 2. ఏదైనా కారణం చేత గత నిర్ణయంపై స్టే విధించాలనుకుంటున్నారా? 3. ఫెడరల్, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఈ వ్యాజ్యం కొనసాగించాలని పార్టీలు అంగీకరిస్తాయా? నివేదికతో పాటు ప్రతిపాదిత ఉత్తర్వులను అందించాలి. "