నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం (ఎన్డీఏఏ) బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. 740 బిలియన్ డాలర్ల రక్షణ బిల్లుకు యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు చట్ట సభల్లో రాజకీయాలకు అతీతంగా భారత్‌కు మద్దతు లభించింది. భారత్- చైనా సరిహద్దు ప్రాంతమైన ఎల్‌ఏసీ వెంబడి చైనా దురాక్రమణను సభ్యులు ప్రస్తావించారు.
కీలక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం- భారత్‌కే లాభం! - ఎన్డీఏఏ బిల్లు పూర్తి వివరాలు
740 బిలియన్ డాలర్ల రక్షణ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ అమోదం తెలిపింది. ఈ బిల్లులో చేర్చిన సవరణల ద్వారా భారత్ సహా ఇతర మిత్ర దేశాలకు అమెరికా మద్దతు ఉండనున్నట్లు భారతీయ అమెరికన్ చట్ట సభ్యుడు కృష్ణమూర్తి తెలిపారు.
బిల్లులో చేర్చిన సవరణలు ద్వారా భారత్ సహా.. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్యులకు అగ్రరాజ్యం మద్దతు ఉంటుందని భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యుడు కృష్ణమూర్తి అన్నారు. సరిహద్దుల్లో భారత్‌ను చైనా రెచ్చగొట్టడాన్ని రక్షణ చట్టం అంగీకరించదన్న సందేశాన్ని వినిపించారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించటంలో భారత్ వంటి మిత్రదేశాలకు అమెరికా అండగా ఉంటుందని చెప్పారు. దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాల్లో చైనా వినిపిస్తోన్న ప్రాదేశిక వాదనలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని ఎన్డీఏఏ బిల్లు పేర్కొంది.