తెలంగాణ

telangana

ETV Bharat / international

టిబెట్​ అంశంపై అమెరికా, చైనా ఢీ అంటే ఢీ! - corona news

టిబెట్​లో దలైలామా వారసత్వానికి సంబంధించిన అంశంలో.. అమెరికా, చైనా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టిబెట్​లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేసేలా చూడాలని రూపొందించిన ఓ బిల్లుకు అమెరికా కాంగ్రెస్​ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. పరస్పరం ఆంక్షలకు ఉపక్రమించాయి.

US Congress seeks int'l coalitions to ensure next Dalai Lama is appointed by Tibetan Buddhists
టిబెట్​ అంశంపై అమెరికా, చైనా ఢీ అంటే ఢీ!

By

Published : Dec 23, 2020, 5:35 AM IST

అమెరికా, చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. టిబెట్​లో దలైలామా వారసత్వానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై చర్యలకు అమెరికా కాంగ్రెస్​ ఒక బిల్లును ఆమోదించగా.. చైనా ప్రతిచర్యలకు ఉపక్రమించంది. సదరు బిల్లును ఆమోదించడం వెనుక ఉన్న అమెరికన్​ అధికారులు, వారి కుటుంబసభ్యులపై ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది.

సోమవారం.. అమెరికా కాంగ్రెస్​ కొవిడ్​-19 ఉపశమన ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా టిబెట్​, తైవాన్​, హాంకాంగ్​కు సంబంధించి కొన్ని అంశాలకూ పచ్చజెండా ఊపింది. 'టిబెటన్​ విధానం, తోడ్పాటు బిల్లు-2020'ను ఆమోదించింది. టిబెట్​ వాసులకు అమెరికా స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సాయం చేయవచ్చని తెలిపింది. టిబెట్​లో అమెరికా కాన్సులేట్​ ఏర్పాటయ్యేవరకూ తమ దేశంలో కొత్తగా చైనా కాన్సులేట్లను ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. టిబెట్​ అంశంపై ప్రత్యేక దౌత్యాధికారి పాత్రను విస్తరించడానికి అనుమతించింది.

దలైలామా ఎంపికపై..

కేవలం టిబెట్​లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేసేలా చూడటానికి వీలుగా అంతర్జాతీయ మిత్రపక్షాలను కూడగట్టాలంది. ఈ ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దానిపై నిర్ణయాలన్నీ ప్రస్తుత దలైలామా, టిబెట్​వాసులే తీసుకోవాలని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే చైనా అధికారులపై ఆర్థిక, వీసా సంబంధ ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నీటి భద్రతపై ప్రాంతీయ కార్యాచరణను ప్రోత్సహించేలా అమెరికా విదేశాంగ శాఖ చర్యలు తీసుకోవాలని సదరు బిల్లు సూచించింది.

నదీ జలాలపై హక్కులున్న దేశాల మధ్య సహకార ఒప్పందాలు కుదిరేలా చూడాలంది. నదులపై అడ్డగోలుగా డ్యామ్​లు నిర్మిస్తున్న చైనా వైఖరిని గర్హిస్తూ, భారత వైఖరిని సమర్థించేలా ఈ నిబంధనలు ఉన్నాయి.

సహించబోం: చైనా

టిబెట్​ బిల్లుపై సంతకం చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ కోరారు. టిబెట్​, తైవాన్​, హాంకాంగ్​ వ్యవహారాలు తమ అంతర్గతమని స్పష్టం చేశారు. వీటిలో విదేశీ జోక్యాన్ని సహించబోమన్నారు. అమెరికా అధికారులపై ప్రతిచర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు తమ సార్వభౌమాధికారాన్ని సవాల్​ చేస్తూ వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తరిమేశామని చైనా మంగళవారం తెలిపింది.

ఇదీ చూడండి:'దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి'

ABOUT THE AUTHOR

...view details