పసిఫిక్ మహాసముద్రంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందించిన క్షిపణిని అమెరికా వాయుసేన పరీక్షించింది. ఆయుధాలు లేని మినట్మన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కాలిఫోర్నియా నుంచి ప్రయోగించినట్లు ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ వెల్లడించింది.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన అమెరికా - ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన అమెరికా
నిరాయుధ మినట్మన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియా నుంచి ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశ వాయుసేన తెలిపింది. అయితే ప్రపంచంలోని ప్రస్తుత పరిణామాలకు ఈ పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం నుంచి అర్థరాత్రి 12.21 గంటలకు క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. అందులోని మూడు రీఎంట్రీ వాహనాలు 4,200 మైళ్లు ప్రయాణించి మార్షల్ దీవులలోని క్వాజలీన్ అటోల్ ప్రాంతానికి చేరుకున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం చేపట్టిన క్షిపణి ప్రయోగాలు సాధారణమైనవేనని ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ప్రపంచ పరిణామాలతో వీటికి సంబంధం లేదని స్పష్టం చేసింది. మినట్మన్ 3 అణ్వాయుధ వ్యవస్థను సుస్థిరం చేయడానికి ఈ ప్రయోగ పరీక్షలు సహకరిస్తాయని 576వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్ కర్నల్ ఒమర్ కోల్బర్ట్ వెల్లడించారు.