అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అగ్రరాజ్యంలో మృతుల సంఖ్య 10 వేల మార్క్‌ను చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. దేశంలో దాదాపు 95 శాతం జనాభాకు ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని గుర్తుచేశారు.
కరోనా వైరస్‌తో అమెరికాలో మృతుల సంఖ్య 9,618కు చేరింది. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడింతలు. ఆదివారం ఒక్కరోజే 1,165 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా దాదాపు 25,316 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 3,36,830కి చేరింది.