చైనా దుందుడుకు వైఖరిపై అమెరికా స్పందించింది. పొరుగుదేశాలను భయభ్రాంతులకు గురిచేసేలా డ్రాగన్ తీరు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-చైనా సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.
"పరిస్థితిని పరిశీలిస్తున్నాం. భారత్-చైనా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చలను గమనిస్తున్నాం. ప్రత్యక్ష చర్చల ద్వారా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం రావాలని కోరుకుంటున్నాం. పొరుగువారిని భయానికి గురిచేసేలా చైనా వరుస ప్రయత్నాలు చేయడంపై అమెరికా ఆందోళనగా ఉంది."
-ఎమిలీ జే హార్న్, శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి
ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తుందని ఎమిలీ స్పష్టం చేశారు. ఇందుకోసం అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై బైడెన్ యంత్రాంగం స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాలిఫోర్నియాలోని దావిస్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అపవిత్రం చేయడాన్ని శ్వేతసౌధం ఖండించింది. ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
దావిస్ నగర యంత్రాంగం సైతం ఈ ఘటనను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆస్తులు ధ్వంసం చేసే చర్యలకు తమ మద్దతు ఉండదని పేర్కొంది. ఈ ఘటన వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి సానుభూతి ప్రకటించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను జవాబుదారీని చేస్తామని స్పష్టం చేసింది.