సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లిన పార్కర్ సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమనౌక ‘పార్కర్ సోలార్ ప్రోబ్’.. మొట్టమొదటిసారిగా అత్యంత విలువైన డేటాను పంపింది. సౌర గాలులు, అంతరిక్ష వాతావరణానికి సంబంధించి కీలక వివరాలను అందించింది.
పార్కర్ సోలార్ ప్రోబ్‌ను గత ఏడాది ఆగస్టులో నాసా ప్రయోగించింది. ఈ వ్యోమనౌక ప్రస్థానంలో మొత్తం 24 సార్లు సూర్యుడికి అత్యంత చేరువగా వెళుతుంది. అందులో మూడు ప్రయత్నాలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. సౌర గోళానికి దగ్గరగా వెళ్లినప్పుడు అధునాతన పరికరాలతో పరిశీలనలు సాగిస్తుంది.
విలువైన సమాచారం..
సూర్యుడి వెలుపలి వాతావరణాన్ని కరోనాగా పిలుస్తారు. సూర్యుడి ఉపరితలం కన్నా అక్కడ వందల రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గుట్టు విప్పడానికి సాయపడే సమాచారాన్ని పార్కర్ ప్రోబ్ అందించింది. కరోనాలోని అయస్కాంత నిర్మాణాలు కనిపించాయని, చిన్నపాటి కరోనల్ రంధ్రాల నుంచి సౌర గాలులు వస్తున్నట్లు స్పష్టమైందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ స్టువార్ట్ బాలె చెప్పారు.
సౌర గాలుల్లో ఎక్కువగా ఆవేశిత రేణువులు ఉంటాయి. వీటిలో ప్రోటాన్లు, హీలియం కేంద్రకాలదే అధిక వాటా. వీటిలో నెమ్మదిగా, వేగంగా సాగే సౌర గాలులు ఉంటాయి. వేగవంతమైన గాలులు సెకనుకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల జోరుతో దూసుకొస్తుంటాయి. సూర్యుడికి చేరువగా వెళ్లినప్పుడు మైక్రాన్ కన్నా చిన్న రేణువులు పార్కర్ ప్రోబ్‌ను ముంచెత్తడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవి సౌర గోళానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆవిరైన గ్రహశకలాలు, తోకచుక్కల ధూళి అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రయోజనాలు..
- సూర్యుడి నుంచి వేగంగా దూసుకొచ్చే రేణువులు, శక్తి తీరుతెన్నులపై కొత్త సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో మన నక్షత్రానికి సంబంధించిన ప్రాథమిక సందేహాలకు జవాబులు కనుగొనే దిశగా ముందడుగు పడినట్లే.
- అంతరిక్షంలోని వ్యోమగాములు, ఉపగ్రహాలను మెరుగ్గా రక్షించుకునేందుకు ఇది సాయపడుతుంది. ఈ డేటా వల్ల.. భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంపై అంచనాలు వేయడానికి ఉపయోగించే నమూనాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది.
- నక్షత్రాల పుట్టుక, వృద్ధి తీరుపై మరింత స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి.
ఇదీ చూడండి: ట్రంప్ అభిశంసనలో కీలక మలుపు.. ముసాయిదా బిల్లు ఏర్పాటు!