అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన దృష్ట్యా, యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి వ్యయం సుమారు 3 శాతం పెరుగనుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై చైనా తాజాగా సుంకాలు విధిచడమే ఇందుకు కారణం.
"చైనాలో తయారయ్యే బ్యాటరీలు, ఇతర విడిభాగాలపై పన్నులు పెరిగిన కారణంగా ఐఫోన్ ఉత్పత్తి వ్యయం 2 నుంచి 3 శాతానికి పెరుగుతుంది." -డాన్ ఇవీస్, వెడ్బుష్ విశ్లేషకుడు, ఫార్చూన్ కోట్
యాపిల్.... ఇంతకు ముందు ప్రతి సెల్ఫోన్ విక్రయం ద్వారా ఎంత మొత్తం లాభాలు ఆర్జించిందో, ఇప్పుడూ అంతే మొత్తం లాభాలను సాధించాలంటే, కచ్చితంగా ఐఫోన్ ధరలను పెంచాల్సిందే. ఉదాహరణకు 'ఐఫోన్ 10ఎస్' ధర 999 డాలర్లు నుంచి 1,029 డాలర్లకు పెంచాల్సి ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్నులు పెంచారు. మరో 325 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపైనా సుంకాలు విధించాలని అధికారులను ఆజ్ఞాపించారు. ఇదే అమలులోకి వస్తే, ఐఫోన్ ఉత్పత్తి ధరలు అమాంతం పెరిగి, ఒక్కో ఫోన్ తయారీకి సుమారు 120 డాలర్లు అవుతుందని, వెడ్బుష్ విశ్లేషకుడు ఇవీస్ చెబుతున్నారు.