అమెరికా క్యాపిటల్ భవనంపై ఈ ఏడాది జనవరి 6న జరిగిన దాడి.. వివిధ భద్రతా సంస్థల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందని సెనేట్ తమ తాజా నివేదికలో పేర్కొంది. దాడి ప్రణాళికలపై ముందే హెచ్చరికలు అందినప్పటికీ, వాటిని ఉన్నత స్థాయి నాయకత్వానికి చేరవేయటంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయంటూ పెదవి విరిచింది.
దేశాధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించే ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వందల మంది క్యాపిటల్ భవనంపైకి జనవరి 6న దూసుకెళ్లారు. నాటి ఘర్షణలపై దర్యాప్తు జరిపి, సెనేట్ బృందం రూపొందించిన నివేదిక మంగళవారం విడుదలైంది.
" ట్రంప్ మద్దతుదారులు, కొన్ని అతివాద సంస్థల సభ్యులు క్యాపిటల్పైకి ఆయుధాలతో దండెత్తేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని స్పష్టమైన హెచ్చరికలు, సూచనలు ముందే అందాయి. కానీ వాటిని నిఘా వర్గాలు ఉన్నతస్థాయి నాయకత్వానికి చేరవేయలేదు. ఫలితంగా బీభత్సం జరిగింది. మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలంటే.. క్యాపిటల్ భవన పోలీసు అధిపతికి మరిన్ని అధికారాలివ్వాలి. "