తాలిబన్ల దురాక్రమణతో అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకు పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రధాన నగరాలన్నీ క్రమక్రమంగా ముష్కరుల చేతిలోకి జారుకుంటున్నాయి. వేగంగా దూసుకొస్తున్న తాలిబన్లను అడ్డుకోవడం అఫ్గాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఇదిలా ఉంటే.. పలు దేశాలు అఫ్గాన్‌లో ఉన్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చే పనిలో పడ్డాయి. ఇందుకోసం సైన్యాన్ని పంపిస్తున్నాయి.
అఫ్గాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా అమెరికా తరలించేందుకు అదనపు దళాలను రక్షణ శాఖ పంపిస్తోందని అగ్రరాజ్య విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ మేరకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చించినట్లు వెల్లడించారు. కాన్సులర్ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
రాయబార కార్యాలయాన్ని మూసేసే ఉద్దేశంతో ఇప్పటికే మూడు వేల మంది దళాలను అమెరికా పంపుతోంది. యూకే దేశస్థులు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు సహకరించేలా మరో 600 మంది జవాన్లను పంపనున్నట్లు తెలిపింది.
కెనడా
మరోవైపు, కాబుల్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన కెనడా.. అక్కడి సిబ్బందిని వెనక్కి తెచ్చేందుకు ప్రత్యేక దళాలను పంపిస్తోంది. ఎంత మందిని పంపుతున్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.