భారత మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచి, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడే చర్యలను స్వాగతిస్తామని అమెరికా స్పష్టం చేసింది. కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను బైడెన్ ప్రభుత్వం సమర్థిస్తుందని సంకేతాలిస్తూ అగ్రరాజ్య విదేశాంగ శాఖ ఈమేరకు వ్యాఖ్యానించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపైనా అమెరికా స్పందించింది. శాంతియుత నిరసనలను... భారత్లో పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యానికి చిహ్నంగా అభివర్ణించింది. ఈ విషయంలో సంబంధిత పక్షాలు(రైతులు, ప్రభుత్వం) మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేసింది. భారత సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్నే పేర్కొందని అక్కడి విదేశాంగ ప్రతినిధి చెప్పారు.
"ఏవైనా విభేదాలుంటే.. చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేం సహకరిస్తాం. సాధారణంగా.. భారత దేశ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచే, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించే చర్యలను అమెరికా స్వాగతిస్తుంది."