ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్-19 టీకాపై తమ దేశంలో నిర్వహించిన క్లినికల్ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ వివరాల్లో 'పాత డేటా'ను వినియోగించి ఉండొచ్చని పేర్కొంది. దీనివల్ల ఆ వ్యాక్సిన్ సమర్థత వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని ఆ దేశ ఫెడరల్ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. అయితే.. తమ డేటాలో ఫిబ్రవరి 17 వరకూ నమోదైన కేసుల వివరాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఆ తర్వాత వెలుగుచూసిన కేసులపై విశ్లేషణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇప్పటికే తాము వెల్లడించిన డేటాకు అనుగుణంగానే ఉందని వివరించింది. దీనిపై 48 గంటల్లో తాజా సమాచారాన్ని వెలువరిస్తామని తెలిపింది.
79 శాతం సమర్థతతో..
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి అమెరికాలో నిర్వహించిన ప్రయోగాల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. అన్ని వయసుల వారిలోనూ బలమైన రక్షణను తమ టీకా కల్పించిందని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్ కేసులను నివారించడంలో ఇది 79 శాతం సమర్థతను చాటిందని తెలిపింది. ప్రయోగంలో భాగంగా టీకా పొందిన వారిలో తీవ్రస్థాయి అనారోగ్యం తలెత్తలేదని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ వల్ల తీవ్రస్థాయి దుష్ప్రభావాలేమీ లేవని స్వతంత్ర పర్యవేక్షకులూ నిర్ధారించినట్లు చెప్పింది. ఐరోపాలోని పలు దేశాల్లో వెలుగుచూసిన విధంగా రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలేమీ జరగలేదని తెలిపింది. ఈ టీకా పొందినవారిలో కొందరికి ఈ ఇబ్బంది తలెత్తిందని చెబుతూ ఐరోపాలోని అనేక దేశాలు దీని సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశాయి. రక్తంలో గడ్డలు ఏర్పడటానికి ఈ టీకా కారణం కాదని ఐరోపా ఔషధాల సంస్థ ప్రకటించినప్పటికీ.. కొన్ని దేశాల్లో ప్రజలు ఆ వ్యాక్సిన్ పట్ల మక్కువ చూపడంలేదని నిపుణులు చెప్పారు.