ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి 'హార్పూన్'కు సంబంధించిన పూర్తిస్థాయి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీని విలువ 8.2 కోట్ల డాలర్లు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్న భారత రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించింది.
'హార్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్' (జేసీటీఎస్) అనే ఈ వ్యవస్థను సరఫరా చేయాలని అమెరికాను భారత్ కోరింది. ఈ ప్యాకేజీలో ఒక హార్పూన్ మధ్యంతర స్థాయి నిర్వహణ కేంద్రం, విడిభాగాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక పత్రాలు, సిబ్బంది శిక్షణ తదితరాలు ఉంటాయి. దీని విక్రయానికి ఆమోదం తెలిపిన అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ).. ఈ విషయాన్ని ఇక్కడి కాంగ్రెస్‌కు తెలిపింది. తాజా నిర్ణయం వల్ల హార్పూన్ క్షిపణుల నిర్వహణ, మరమ్మతులు భారత్‌కు సులువవుతుందని పేర్కొంది. తద్వారా ఆ దేశ పోరాట సన్నద్ధత మెరుగుపడి, భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతుందని వివరించింది.