అమెరికా: కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ టెక్సాస్ అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఎల్పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్ మాల్లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాల్పుల శబ్దాలకు మాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
"బిల్ కట్టడానికి ఎదురుచూస్తుండగా కొంతమంది తుపాకులతో మాల్ లోపలికి వచ్చారు. కనీసం ముగ్గురు లేదా నలుగురు తుపాకులతో కాల్పులు జరిపారు. అందరూ నల్లదుస్తులనే ధరించారు. చాలా భయమేసింది."
--- ఆండ్రియాన, ప్రత్యక్ష సాక్షి.
కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన...
టెక్సాస్ కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మృతులకు సంతాపం తెలిపారు. కాల్పుల ఘటన భయానకమని ట్వీట్ చేశారు.
అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత వారమే అమెరికాలోని ఓ షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత మోగింది.అంతకు ముందు కాలిఫోర్నియాలోని ఓ ఫుడ్ ఫెస్ట్‌లో ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.