తాలిబన్లపై(Afghan Taliban) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కన్పిస్తోంది. అఫ్గానిస్థాన్‌లో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులే ఈ మార్పునకు కారణంగా తెలుస్తోంది. ఉగ్రవాదులపై ఆగస్టు 16న విడుదల చేసిన ఓ ప్రకటనలో తాలిబన్లను ప్రస్తావించిన ఐరాస.. ఆగస్టు 27 నాటి ప్రకటనలో మాత్రం తాలిబన్ల పదాన్ని తొలగించింది. తాలిబన్లు ప్రపంచానికి ముప్పు కాదని ఐరాస భద్రతా మండలి మొదటిసారి సూచన ప్రాయంగా ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు మాసానికి యూఎన్ఎస్సీ ఛైర్మన్‌గా(UNSC Chairman) ఉన్న భారత్.. ఈ స్టేట్మెంట్పై ఏమాత్రం ఆలోచించకుండా సంతకం చేయడం గమనార్హం.
తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న(Afghanistan Crisis) మరునాడు ఆగస్టు 16న ఐరాస భద్రతా మండలిలో(UNSC) భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఓ ప్రకటనను విడుదల చేశారు.
"అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ఐరాస భద్రతా మండలి సభ్యులు మరోసారి పునరుద్ధాటిస్తున్నారు. ఉగ్రవాద దాడులకు, కార్యకలాపాలకు, ఇతర దేశాలను బెదిరించడం వంటి వాటికి అఫ్గాన్ కేంద్రం కాకూడదు. తాలిబన్లు గానీ, ఇతర ఏ వర్గం గానీ, వ్యక్తులు గానీ అఫ్గాన్ భూభాగం.. మరే ఇతర దేశాల్లోని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండొద్దు." అని ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఆగస్టు 27 విడుదల చేసిన ఇదే ప్రకటనలో తాలిబన్ పదాన్ని పూర్తిగా తొలగించింది యూఎన్ఎస్సీ.
దీనిపై యూఎన్ఎస్సీలో భారత మాజీ శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్ధీన్ స్పందించారు. 'దౌత్య విధానంలో రెండు వారాలంటే చాలా ఎక్కువ సమయం. ప్రకటనలో 'టీ'(తాలిబన్) పదం మాయమైపోయింది.' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.