తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ముందస్తు గోల- పోస్టల్‌ బ్యాలెట్లపై కోర్టుల్లో యుద్ధం - republican party

అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్​కు వీలుకల్పించిన పోస్టల్​ బ్యాలెట్లపై అమెరికాలో రిపబ్లికన్​, డెమొక్రాటిక్​ పార్టీల మధ్య ఒకరకంగా యుద్ధం సాగుతోంది. అధికారికంగా నవంబర్​ 3న పోలింగ్​ అయినప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోస్టల్​ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్​ నమోదవుతోంది. దీంతో.. ముందస్తు ఓటింగ్​ శాతం పెరుగుతున్న కొద్దీ, ట్రంప్​కు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే భావన రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో.. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

United States Presidential election: The war in the courts over postal ballots
అమెరికా ముందస్తు గోల: పోస్టల్‌ బ్యాలెట్లపై కోర్టుల్లో యుద్ధం

By

Published : Oct 29, 2020, 11:47 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గటానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాయి రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ పార్టీలు! తాజాగా.. ముందస్తు ఓటింగ్‌కు వీలుకల్పించిన పోస్టల్‌ బ్యాలెట్లపై రెండు పార్టీల మధ్యా ఒకరకంగా యుద్ధం సాగుతోంది! గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్‌ నమోదవుతోంది! అధికారికంగా నవంబరు 3న అధ్యక్ష ఎన్నికకు పోలింగ్‌ అయినప్పటికీ.. ఇప్పటికే అనేక రాష్ట్రాలో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ (పోస్టల్‌/ఆబ్సెంటీ ఓటింగ్‌) ద్వారా పోలింగ్‌ సాగుతోంది! కరోనా కారణంగా చాలామంది పోలింగ్‌ తేదీనాడు భారీ క్యూలైన్లలో నిలబడి ఓటు వేయటం కంటే ముందస్తు ఓటింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా డెమొక్రాట్లు! రిపబ్లికన్లు మాత్రం ఓటింగ్‌ రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. ట్రంప్‌ కూడా ముందు నుంచీ పోస్టల్‌ బ్యాలెట్లపై విమర్శలు గుప్పించారు. దీంతో.. ముందస్తు ఓటింగ్‌ శాతం పెరుగుతున్న కొద్దీ.. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే భావన పెరుగుతోంది! దీంతో.. రెండు పార్టీల మధ్య ఈ ముందస్తు, పోస్టల్‌ బ్యాలెట్లు అత్యంత కీలకంగా మారాయి. వీటి ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించాలని ట్రంప్‌ శిబిరం.. మరింత ఎక్కువ చేయాలని బైడెన్‌ పార్టీ (డెమొక్రాట్లు) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ కోర్టుల్లో కేసులు వేస్తూ ఒకరినొకరు నిలువరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:కారు దిగకుండానే ఓటేసి వెళ్లిపోవచ్చు!

పెన్సిల్వేనియాలో వారికి.. విస్కాన్సిన్‌లో వీరికి..

మామూలుగానైతే ఎన్నికల తేదీ (నవంబరు 3) ముగిసేనాటికి అధికారులకు అందే పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు. కానీ అమెరికాలో ప్రతి రాష్ట్రంలోనూ నిబంధనలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. దీంతో.. ఎన్నిక తేదీ తర్వాత ఐదారు రోజులకు అందే పోస్టల్‌ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ డెమొక్రాట్లు ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. తటస్థ ఓటర్లతో.. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ఈ గోల తీవ్రమై చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల తేదీ తర్వాత అందే ఓట్లను కూడా లెక్కించటానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో డెమొక్రాట్లు సంబరపడ్డారు. కానీ విస్కాన్సిన్‌లో మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇక్కడ రిపబ్లికన్‌ల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. మునుముందు న్యాయస్థానాలు ఎలాంటి తీర్పునిస్తాయోననే భావనతో డెమొక్రాట్లు తమ ఓటర్లంతా పోస్టు ద్వారా కాకుండా దగ్గర్లోని పోలింగ్‌ బాక్సుల్లో ఓట్లు వేయాలని.. భారీస్థాయిలో ప్రచారం మొదలెట్టారు. ఎందుకంటే- పోస్టల్‌ బ్యాలెట్లను సకాలంలో తపాలా శాఖ అందజేయకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు. అమెరికా తపాలా శాఖ ట్రంప్‌కు అనుకూలంగా పనిచేస్తుందని.. కాబట్టి పోస్టల్‌ బ్యాలెట్లను కావాలని ఆలస్యం చేసే అవకాశం ఉందని డెమొక్రాట్లు ముందునుంచీ అనుమానిస్తున్నారు. అందుకే.. ఎన్నికల తేదీ తర్వాత కొద్దిరోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఈ వ్యవహారం చివరకు కోర్టుల్లో ఎటు తిరిగి ఏమౌతుందో తెలియని పరిస్థితుల్లో ముఖ్యంగా డెమొక్రాట్లు చివరి నిమిషంలో జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు- పోలింగ్‌ తేదీ నాడు భారీస్థాయిలో తమ మద్దతుదారులు వచ్చి ఓటు వేసేలా రిపబ్లికన్లు వ్యూహాలు రచిస్తున్నారు. తద్వారా ముందస్తు ఓట్ల ప్రభావాన్ని తగ్గించొచ్చని అంచనా!

వందల సంఖ్యలో ఫిర్యాదులు

ఇవన్నీ ఒకెత్తైతే.. ఓట్ల అర్హతపైనా, ఓటింగ్‌ తీరుపైనా స్థానికంగా ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతుండటం విశేషం. అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని సంక్లిష్టం చేసే వ్యూహంలో భాగంగా కూడా ఇలా పార్టీలు చేస్తుంటాయంటారు! మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే.. ఈసారి ఎన్నికల్లో ఫలితం తేలటానికి మాత్రం చాలా రోజులు పట్టే అవకాశం ఉందనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల రోజు వచ్చే ఫలితాలే అంతిమం కాకపోవచ్చు. ముందస్తుగా ఎవరు ఆధిక్యంలోకి వచ్చినా.. భారీస్థాయిలో నమోదవుతున్న పోస్టల్‌ ఓట్లు కూడా పూర్తిస్థాయిలో లెక్కిస్తేగాని అంతిమ ఫలితం తేలదు. కాబట్టి డొనాల్డ్‌ ట్రంప్‌-బైడెన్‌ల మధ్య జయాపజయాలు రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు ఆధారంగా కొద్ది రోజులు ఊగిసలాడే అవకాశాలు ఎక్కువున్నాయి.

ఇదీ చూడండి:అమెరికా ఓటరు ఎటువైపు? 'విజేత'పై ఉత్కంఠ..

ABOUT THE AUTHOR

...view details