కరోనా మహమ్మారి నుంచి రక్షించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు టీకాలు తుది దశకు చేరుకోగా... ఆ ఆశలు రెట్టింపయ్యాయి. అయితే.. ప్రతి దేశపు అవసరాల్ని తీర్చే స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఎలా తయారు చేస్తారు? చేసిన వాటిని ఎలా పంపిణీ చేస్తారు? ముందు ఎవరికి ఇస్తారు? అన్న అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరైన నిర్వహణ లేకపోతే.. పేద దేశాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గురుతర బాధ్యతను యూనిసెఫ్ తన భుజాల మీదకు ఎత్తుకుంది. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ ప్రక్రియల్ని స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే అనేక వ్యాధులకు సంబంధించి ఏటా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఈ సంస్థ కొనుగోలు చేస్తోంది. వీటిని దాదాపు 100 దేశాల్లో పిల్లలకు అందజేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేషన్..
తాజాగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ కొవాక్స్ అనే 150 దేశాల కూటమి తరఫున యూనిసెఫ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద, అత్యంత వేగవంతమైన ఆపరేషన్‌గా నిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి రివాల్వింగ్ ఫండ్ ఆఫ్ ద ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్(పీఏహెచ్‌వో) సహకారం తీసుకోనుంది. ఇందులో భాగంగా 92 దిగువ, దిగువ-మధ్యాదాయ దేశాలకు యూనిసెఫ్ తన సహకారంతో వ్యాక్సిన్ డోసుల్ని అందుబాటులో ఉంచనుంది. ఇక కొవాక్స్‌లో భాగంగా ఉన్న మరో 80 అధికాదాయ దేశాలకు వ్యాక్సిన్ కొనుగోలులో సమన్వయకర్తగా వ్యవహరించనుంది.
అన్ని దేశాలకు సమాన అవకాశం..