కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీకి సన్నద్ధమవుతోంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్. ఇందుకోసం ప్రధాన విమానయాన సంస్థలు, రవాణా, షిప్పింగ్ లైన్స్ వంటి 350 అంతర్జాతీయ భాగస్వామ్యాలతో చర్చలు జరపుతోంది. టీకా కొనుగోలు, సరఫరా, పంపిణీ గతంలో ఎన్నడూ చేపట్టని భారీ కార్యక్రమంగా పేర్కొంది సంస్థ.
వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతలో భాగంగా గత వారమే పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్(పీఏహెచ్ఓ), అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్(ఐఏటీఏ)లతో సమావేశమైంది యునిసెఫ్. 2021లో సుమారు 2 బిలియన్ల కొవిడ్-19 టీకా డోస్‌లను రవాణా చేసే అంశంపై చర్చించింది. ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థల సామర్థ్యం, త్వరితగతిగా, సురక్షిత రవాణాపైనా చర్చించారు. రెండు బిలియన్ల టీకా డోస్‌లతో పాటు అదనంగా సముద్ర మార్గం ద్వారా 1 బిలియన్ సిరంజిల రవాణా చేపట్టాలని సూచించింది.
" కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలోనే టీకా త్వరితగతంగా, సురక్షితంగా పంపిణీ చేసేందుకు యునిసెఫ్ చర్యలు చేపట్టింది. ఈ చారిత్రక, భారీ ఆపరేషన్ కోసం తగిన రవాణా సామర్థ్యం ఉందని ఈ భాగస్వామ్యం నిర్ధరిస్తోంది. కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న సిబ్బందిని రక్షించుకునేందుకు వ్యక్తిగత భద్రత కిట్లు, సిరంజిలు, కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసేందుకు అందరి సహకారం అవసరం. కరోనా వారియర్స్‌ను రక్షించుకున్నట్లయితే.. లక్షల మంది పిల్లలను రక్షించుకున్నట్లే. "