అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సంస్కరణలు అత్యావశ్యకమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లారెన్స్ సమ్మర్స్తో సంభాషణలో పాల్గొన్న ఆమె.. సంస్కరణలు లేక పోవడం వల్ల చాలా దేశాల్లో దశాబ్దాలుగా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పలు దేశాలు దశలవారీగా సంస్కరణలు తీసుకొస్తున్నా.. అంతార్జాతీయ సంస్థలు మాత్రం ఏళ్లు గడిచినా పాత విధానాలతోనే ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
" దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహించని దేశాల్లో వాణిజ్య, భద్రత, ద్రవ్య విధానం వంటి సమస్యలపై అంతర్జాతీయ సంస్థలు గళమెత్తడం లేదు. అభివృద్ధి కోసం నిధుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సంస్థల్లో సంస్కరణలు జరగడం అత్యవసరం. సరైన ప్రాతినిధ్యం దక్కని దేశాల కోసం గొంతెత్తే విధంగా ఈ సంస్థలు పారదర్శకతతో ఉండాలి. తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఉత్తర, దక్షిణ దేశాలకు సరైన న్యాయం జరగడం లేదు. ఆఫ్రికా, పసిఫిక్‌లోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. సంస్కరణలు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. "
-నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి