9వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది పేదలను రక్షించవచ్చని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ 90 బిలియన్ డాలర్లతో పేదల ఆదాయం, ఆరోగ్యం, ఆహారం వంటికి ఆటంకం కలగకుండా చూసుకోవచ్చని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ మార్క్లోకుక్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు 20 ధనిక దేశాలు మంజూరు చేసిన ప్యాకేజీ(8 ట్రిలియన్ డాలర్ల)ల్లో ఇది కేవలం 1శాతంగా ఉండటం గమనార్హం.
పేద దేశాలపై కరోనా వైరస్ ఇంకా పంజా విసరలేదని లోకుక్ తెలిపారు. అయితే రానున్న 3-6 నెలల్లో ఆ దేశాలపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.
ఈ 70 కోట్ల మంది ప్రజలు 30-40 దేశాలకు చెందిన వారని.. వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉందని లోకుక్ తెలిపారు. ఇప్పటికే వీరికి సహాయం అందుతోందని స్పష్టం చేసిన ఆయన.. కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వాలు తీసుకునే కఠిన నిర్ణయాలతో వారి ఆదాయం దెబ్బతింటుందన్నారు.