కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి అంతర్జాతీయ సంస్థలు. ఈ క్రమంలోనే భయానక కొవిడ్-19 రెండో దశపై పోరులో భారత్‌కు సాయం చేసేందుకు ఐక్యరాజ్య సమితి సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
" మొత్తం ఐరాస కుటుంబం తరఫున, భయానక కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటున్న భారత ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నా. భారత్‌కు సాయం చేసేందుకు ఐరాస సిద్ధంగా ఉంది. "
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
గుటెరస్ ట్వీట్‌కు సమాధానమిచ్చారు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి. ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతుగా నిలుస్తున్నందుకు భారత్ అభినందిస్తోందని తెలిపారు. భారత్‌లోని ఐరాస అన్ని విధాలా సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇటీవలే.. యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వాల్కన్ బోజ్కిర్, భారత్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు భారత్ ఎంతో కృషి చేసిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌కు ప్రపంచం మద్దతుగా నిలవటం, సాయం చేసేందుకు సమయమని కోరారు. అందరం సురక్షితంగా ఉండే వరకు ఏ ఒక్కరం భద్రంగా ఉన్నట్లు కాదన్నారు.
ఇదీ చూడండి:'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'