భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలో వద్దో స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు మహిళలకు కరవవుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. గర్భనిరోధక సాధనాలు వినియోగించడం, ఆరోగ్య సేవలు పొందడం వంటి విషయాల్లోనూ వారికి నిర్ణయాధికారం ఉండటం లేదని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న 57 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం 'ఐరాస జనాభా నిధి (యూఎన్‌పీఎఫ్)' ఈ నివేదికను విడుదల చేసింది. కోట్ల మంది మహిళలు, బాలికలకు శారీరక స్వతంత్రత లేదని అందులో ఆవేదన వ్యక్తం చేసింది.
"శారీరక స్వతంత్రతను నిరాకరించడమంటే మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. అసమానతలకు, లింగ వివక్ష ఆధారిత హింసకు అది దారితీస్తుంది" అని యూఎన్‌పీఎఫ్ కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ నటాలియా కానెమ్ పేర్కొన్నారు.