తెలంగాణ

telangana

ETV Bharat / international

'సయీద్​' ఉగ్రవాదే!

జమాత్​ ఉద్​ దావా వ్యవస్థాపకుడు, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​ అభ్యర్థనను ఐరాస ఆంక్షల కమిటీ తోసిపుచ్చింది. అతను అంతర్జాతీయ ఉగ్రవాదేనని స్పష్టం చేసింది.

'సయీద్​' ఉగ్రవాదే! : ఐరాస

By

Published : Mar 7, 2019, 7:23 PM IST

ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, 'జమాత్ ఉద్​ దావా' వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​కు ఐక్యరాజ్యసమితిలో ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలన్న ముష్కరుడి అభ్యర్థనను ఐరాస తోసిపుచ్చింది. సాధారణంగా అప్పీలు చేసిన ఆరు నెలల్లోపే తీర్పు వెలువరించాలి. కానీ సయీద్​ తరపు అంబుడ్స్​మన్​ మారడం వల్ల జాప్యమైంది.

సయీద్​ ఉగ్ర కార్యకలాపాల గురించి అత్యంత గోప్యమైన సమాచారాన్ని భారత్ ఐరాస ఆంక్షల కమిటీకి​ అందజేసింది. దీంతో సయీద్​పై ఉన్న నిషేధం తొలగించబోమని అతని తరపు న్యాయవాది హైదర్​ రసూల్ మీర్జాకు ఐరాస ఆంక్షల కమిటీ స్పష్టం చేసింది.

కఠిన ఆంక్షలు తప్పవు...

ఐరాస ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారంపై నిషేధిత ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాదుల ఆర్థిక వనరులను ఐరాస సభ్యదేశాలు స్తంభింపజేయాలి. తీవ్రవాదుల రాకపోకలపై నిషేధం విధించాలి.

అలాగే ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సైనిక, ఆర్థిక సహకారం అందించకూడదు. వారికి ఆయుధాలు అమ్మకూడదు, సరఫరా చేయకూడదు. ఎలాంటి సాంకేతిక సహకారం అందించకూడదు.

'సయీద్' నీచ చరిత్ర

హఫీజ్ సయీద్​​ 'లష్కరే తోయిబా' సహవ్యవస్థాపకుడు. 'జమాత్​ ఉద్​ దావా'ను స్వయంగా స్థాపించాడు. 2008 ముంబయి ఉగ్రవాద దాడుల్లో 166 మంది అమాయకులు మరణించడానికి కారకుడు. ఈ కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ ముష్కరుడిని 2008 డిసెంబర్​ 10న అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమాత్​ ఉద్​ దావా సంస్థపై నిషేధం విధించింది.

​ప్రస్తుతం పాక్​లో గృహనిర్బంధం అనుభవిస్తున్న సయీద్​, ఐరాస నిర్ణయంపై 2017లో అప్పీల్‌ చేసుకున్నాడు. తనను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. సయీద్ అభ్యర్థనను భారత్​తో పాటు అమెరికా, యూకే, ఫ్రాన్స్ సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సయీద్​ అభ్యర్థనను ఐరాస తోసిపుచ్చింది. అయితే సయీద్ అభ్యర్థనను ఇమ్రాన్ ఖాన్​ నేతృత్వంలోని (నయా పాకిస్థాన్)​ పాక్​ వ్యతిరేకించకపోవడం విశేషం.

మసూద్​ అజర్ సంగతేంటి?

పుల్వామా ఉగ్రదాడికి బాధ్యుడు, జైష్​ ఏ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్​ అజహర్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాస భద్రతా మండలికి​ విజ్ఞప్తి చేసింది భారత్. దీనిని గత నెలలో అమెరికా, యూకే, ఫ్రాన్స్​ సైతం సమర్థించాయి. జైష్​ ఏ మహమ్మద్​ను ఉగ్రవాద సంస్థగా ఐరాస ఇప్పటికే ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details