సైనిక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మయన్మార్ ప్రజలు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజంపై ఆశలు పెట్టుకున్నారని ఐరాస అధికారి ఆండ్రూ క్రిక్‌వుడ్ తెలిపారు. సైనిక పాలనపై పెద్దఎత్తున ఆంక్షలు విధించడం సహా.. పౌరప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు యూఎన్ శాంతి పరిరక్షణ దళాలు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మయన్మార్‌లో చెలరేగుతున్న హింసపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గూటెరస్ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు భద్రతా మండలిలోని దేశాలు ఐక్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
మయన్మార్‌లో ప్రజాందోళనలను అణచేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 211 మంది చనిపోయినట్లు క్రిక్‌వుడ్ తెలిపారు. వీరిలో 15 మంది చిన్నారులున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న మరో 2 వేల 400 మందిని సైన్యం నిర్బంధించినట్లు వివరించారు.