2020లో కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం అధ్యక్షుడు మార్క్ లాకాక్. ప్రపంచ దేశాలన్నీ అంతర్యుద్ధాన్ని, సంఘర్షణలు వదిలి ఉమ్మడి శత్రువైన కరోనాపై పోరాడాలని ఐరాస పిలుపునిచ్చినా.. సఫలం కాలేదని అన్నారు. మరిన్ని కొత్త ఘర్షణలు పుట్టుకొచ్చాయని తెలిపారు. పౌరులు- ఘర్షణకు సంబంధించి ఐరాస భద్రతా మండలి జరిపిన వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
"సిరియా, యెమన్, కాంగోలో ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ ఘర్షణల వల్ల కరోనా వ్యాప్తి కట్టడిలో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇథియోపియా, మొజాంబిక్, ఆర్మేనియా, అజర్ బైజాన్‌లో జరిగిన తీవ్ర ఘర్షణలు, తీవ్రవాద దాడులు చాలామందిని వలసవెళ్లేలా చేశాయి. కరోనా కాలంలో మానవ హక్కల ఉల్లంఘనలు విపరీతంగా జరిగాయి. గత నెలలో అఫ్గానిస్థాన్‌లోని బాలికల పాఠశాలపై తీవ్రవాద దాడులు పదుల సంఖ్యలో విద్యార్థుల్ని బలిగొన్నాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలో 200 మందికిపైగా మృతి చెందారు."