వచ్చే వారం జరగనున్న మూడు కీలక ఎన్నికలకు ఐక్యరాజ్యసమితి సన్నద్ధమైంది. కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఓటు వేసేలా 193 సభ్య దేశాలకు వివిధ సమయాన్ని కేటాయించింది. ఐరాస సాధారణ సభలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో భారత్ అభ్యర్థిగా ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్ఈ) తాత్కాలిక సభ్య దేశం ఎన్నిక కూడా ఒకటి.
ఐరాస సాధారణ సభ అధ్యక్షుడు తిజ్జన్ ముహమ్మద్-బండే దగ్గరుండి ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాధారణ సభ తదుపరి.. అధ్యక్షుడు, భద్రతా మండలి తాత్కాలిక దేశాలు, ఆర్థిక-సామాజిక మండలి సభ్యుల ఎన్నికలు ఈ నెల 17న ఉదయం 9గంటలకు అసెంబ్లీ హాల్లో జరుగుతాయని సభ్య దేశాలకు ఇప్పటికే స్పష్టం చేశారు ముహమ్మద్-బండే.
193 సభ్య దేశాల కోసం 8 టైమ్ స్లాట్లను కోటాయించారు. వీరందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూనే.. బ్యాలెట్లలో తమ ఓటు వేయాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు ఓటు వేయలేని వారి కోసం అదనంగా 30నిమిషాల సమయం ఇచ్చారు. 11:30 నుంచి 12గంటల మధ్యలో భారత్ ఓటు వేయాల్సి ఉంటుంది.