సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్లో ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) ఉన్నత స్థాయి సమావేశం సోమవారం ప్రారంభమైంది. మయన్మార్లో సైన్యం తిరుగుబాటు, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టు, శ్రీలంక, ఇథియోపియోలో హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
యూఎన్హెచ్ఆర్సీ సమావేశానికి అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరయ్యారు. వెనిజులాలో అసమ్మతిపై హింసాత్మక అణచివేతకు నేతృత్వం వహించిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఈ సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఉయ్గర్లపై చైనా అనుసరిస్తున్న వైఖరిని కూడా ఇందులో చర్చించనున్నారు. నాలుగు వారాల పాటు ఈ భేటీ జరగనుంది.