ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో అమెరికా తిరిగి జట్టుకట్టడంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. కరోనాపై పోరులో డబ్ల్యూహెచ్ఓకు సహకారం అందించడం అత్యంత కీలకమని అన్నారు. తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు సమానంగా కరోనా వ్యాక్సిన్ అందించాలన్న కార్యక్రమానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
"వైరస్ను అడ్డుకోవడానికి, ఇతర ప్రతికూల పరిణామాలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పనిచేయాల్సిన సమయమిది. కొవిడ్ పోరులో వ్యాక్సినే ముఖ్యమైన సాధనం. అమెరికా డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరడం, కొవాక్స్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ద్వారా అన్ని దేశాలకు టీకా అందించాలన్న సంకల్పానికి ఊతం లభిస్తుంది."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి