కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇతర దేశాలకు భారత్ చేసిన సహాయాన్ని ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ మేరకు భారత చర్యలను కొనియాడారని గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. రాబోయే కాలంలో తిరుమూర్తితో కలిసి పనిచేసేందుకు ఐరాస అధినేత ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. భారత కొత్త శాశ్వత ప్రతినిధికి ఐక్యరాజ్యసమితి స్వాగతం పలుకుతోందన్నారు.
గతవారమే ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు తిరుమూర్తి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్గా తన ఆధారాలను ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా గుటెరస్తో భేటీపై ట్వీట్ చేశారు తిరుమూర్తి.