కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పలు దేశాల్లో లైంగిక హింస పెచ్చరిల్లిందని.. సైనికులు, అతివాదులు యుద్ధ తంత్రంలో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని... చాలా దేశాల్లో రాజకీయ అణచివేత చోటుచేసుకుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ నివేదికను విడుదల చేశారు. మొత్తం 18 దేశాల నుంచి ధ్రువీకరించిన సమాచారాన్ని ఐరాస సేకరించి, ఈ నివేదిక విశ్లేషించింది. ఐరాస భద్రతా మండలి ఎజెండాకు విరుద్ధంగా... మొత్తం 52 గ్రూపులు లైంగిక హింసకు, వేధింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. వీటిలో 70% పార్టీలు నిరంతరం నేరాలు చేస్తున్నట్టు వెల్లడించింది. వీటన్నింటిపైనా నిషేధం విధించినట్టు గుటెరస్ చెప్పారు.
"ఈ పార్టీల్లో చాలామటుకు ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ అతివాద గ్రూపులు, సైనిక, పోలీసు బలగాలతో అనుసంధానమైనవే. హింసను విడనాడేందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకునేంత వరకూ మయన్మార్ మిలిటరీ, బోర్డర్ గార్డులను ఐరాస శాంతి ప్రక్రియలో భాగం కానివ్వం"
-ఆంటోనియో గుటెరస్,ఐరాస ప్రధాన కార్యదర్శి