Ukraine Tension: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలోని శ్వేతసౌధం జాతీయ భద్రత సలహాదారు జాక్ సల్లీవన్. ఉక్రెయిన్పై రష్యా ఏ రోజైనా దాడి చేయవచ్చని హెచ్చరించారు. ఫలితంగా భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశముందని జాక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందుకు తగిన సన్నాహాలు, ప్రతిస్పందనపై నష్ట తీవ్రత ఆధారపడి ఉటుందన్నారు.
అంతకుముందే.. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతోందని.. ఈ మేరకు 70 శాతం ఆయుధ సామగ్రిని సమకూర్చుకుందని అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారు హెచ్చరించారు. ఆ మరుసటి రోజే జాక్ ఈ తీవ్ర హెచ్చరిక చేశారు. అయితే ఉక్రెయిన్ను త్వరితగతిన స్వాధీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోందని.. ఇది 50,000 మంది ప్రాణనష్టానికి దారితీస్తుందని శ్వేతసౌధం చట్టసభ సభ్యులకు వివరించిన నివేదికలను సల్లీవన్ నేరుగా ప్రస్తావించలేదు.