ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్లు పుతిన్ చేసిన ప్రకటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యా దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. రష్యా యుద్ధాన్ని కోరుకుందని.. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనిపై నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యాను ప్రపంచం బాధ్యుల్ని చేస్తుందని స్పష్టం చేశారు.
"ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రజల కోసం ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి ఉక్రెయిన్ ప్రజలు రష్యా సైనిక దాడులకు బాధితులుగా మారుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని కోరుకున్నారు. ఇది తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. రేపు జీ7 దేశాధినేతలతో చర్చిస్తాం. నాటో భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుంటాం."