బ్రెజిల్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా దేశంలోని రెండు రాష్ట్రాల గవర్నర్లకు వైరస్ సోకింది. వీరిద్దరూ గతంలో కరోనాపై పోరులో అధ్యక్షుడు బొల్సొనారో తీరును ప్రశ్నించినవారే.
రియో డి జెనిరో గవర్నర్ విల్సన్ విట్జెల్, ఉత్తర పారా రాష్ట్ర గవర్నర్ హెల్డర్ బార్బల్హో.. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్టు ట్వీట్స్ చేశారు. ఈ వైరస్ ప్రాణాంతకమని.. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నుంచే తనకు గొంతునొప్పి, జ్వరం వంటి వైరస్ లక్షణాలున్నట్టు పేర్కొన్న విల్సన్.. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. వైద్యుల సలహాలు తీసుకుని విధులు నిర్వర్తిస్తానని 52ఏళ్ల రియో డి జెనిరో గవర్నర్ స్పష్టం చేశారు.