అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్‌పై సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ హెచ్చరికలు జారీ చేసింది. మెయిల్ ఓటింగ్ లేదా పోస్టల్ ఓటింగ్ విధానాన్ని గురించి ఆయన ఇచ్చిన సమాచారం పక్కతోవ పట్టించేదిగా ఉన్నందుకే తాము ఈ విధంగా చేసినట్టు సంస్థ వివరించింది.
"గతంలో ఎప్పుడూ లేని విధంగా అవసరానికి మించి భారీ సంఖ్యలో బాలెట్ పేపర్లను ఓటర్లకు లేదా ‘మరెక్కడికో’ పంపిస్తున్నారు. కొంతమంది కోరుకున్న విధంగానే నవంబర్ 3న జరగనున్న ఎన్నికల ఫలితాలు ఎప్పటికీ కచ్చితమైనవి కావు. నిన్నటికి నిన్న మరో ఎన్నికల వివాదం చోటుచేసుకుంది. ఈ బాలెట్ పిచ్చిని ఆపండి!’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా ఈ సమాచారం సందేహాస్పదమైనదిగా ట్విటర్ యాజమాన్యం పేర్కొంది. మెయిల్ ఓటింగ్ సురక్షితమైనది, భద్రమైనదని తెలుపుతూ.. దానిని గురించిన సమాచారాన్ని తెలుసుకునే లింక్‌ను ఆ పోస్టుకు జతచేసింది.