అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. అయితే, ఫలితాల వేళ గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు జో బైడెన్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తుంటే.. మరోవైపు ట్రంప్ తాను విజయం సాధిస్తున్నా.. సాధించా అంటూ ట్వీట్లు పెట్టారు. ఇలా చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి తప్పుడు సమాచారంపై ముందుగానే ఓ కన్నేసి ఉంచిన ట్విటర్.. ఆయన చేసిన ట్వీట్లను లేబుల్ చేసింది. ఈ సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది.
అయితే, కేవలం ట్రంప్‌వే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాదాపు 3 లక్షల ట్వీట్లకు ఈ విధంగా లేబుల్ వినియోగించినట్లు ట్విటర్ తాజాగా పేర్కొంది. అమెరికా ఎన్నికలకు సంబంధించి చేసిన మొత్తం ట్వీట్లలో వీటి వాటా 0.2 శాతమని తెలిపింది.