'హౌదీ మోదీ' కార్యక్రమం అమెరికాలోని భారతీయ-అమెరికన్లు, హిందూ అమెరికన్లనూ ఏకతాటిపైకి తీసుకొస్తుందన్నారు అమెరికా అధ్యక్ష పోటీదారుల్లో ఒకరైన తులసి గబ్బార్డ్. హౌదీ-మోదీ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు గబ్బార్డ్. అదే సమయంలో గతంలో నిర్ణయించిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని వీడియో సందేశం పంపారు.
ఈ సమావేశంతో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు గబ్బార్డ్. పలు కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంతర్జాతీయ సమస్యలపై భారత్-అమెరికాలు కలిసి పనిచేయాలన్నారు.
" హౌదీ మోదీ కార్యక్రమానికి కాంగ్రెస్‌లోని చాలామంది మా సహచరులు హాజరవుతున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్రదేశాల్లో భారత్ ఒకటి. అంతర్జాతీయంగా ప్రభావితం చేస్తున్న సమస్యలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, అణు యుద్ధం, అణు విస్తరణను నివారించేందుకు ఉమ్మడి పోరాటం అవసరం."