ఒక అత్యాశాపరుడు అందలమెక్కితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చూస్తే సరిపోతుంది. ఓ వైపు నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ఆశ- మరో వైపు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికవ్వాలనే లక్ష్యం. ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఫలితంగా మధ్య ప్రాచ్యం, అఫ్గానిస్థాన్, వెనెజువెలా వంటి కీలక ప్రాంతాల్లో శాంతి కరవవుతోంది. అమెరికా ఎన్నికలకు మరో తొమ్మిది నెలలే ఉండటంతో నమ్మిన మిత్రులను నట్టేట ముంచేసి స్వలాభం చూసుకొనే పనిలో ట్రంప్ నిమగ్నమయ్యారు. లాభనష్టాలను లెక్కలేసుకుంటూ ట్రంపులోని వ్యాపార వేత్త విశ్వరూపం చూపిస్తున్నాడు. దానికి తాజా ఉదాహరణే అమెరికా- తాలిబన్ శాంతి ఒప్పందం. దోహాలో తాలిబన్ల తరఫున ముల్లా బరాదర్, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి జల్మే ఖలీజాద్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్థాన్, టర్కీ, ఇండొనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
తాజా ఒప్పందంతో అమెరికా తాను సాగించిన అత్యంత దీర్ఘకాల యుద్ధభూమిలో ఉన్న తమ సైన్యాన్ని 14 నెలల్లో బయటకు తీసుకురావడానికి వీలవుతుంది. అంతేగాక తాలిబన్‌కు, అఫ్గాన్ ప్రభుత్వానికి మధ్య చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ చర్చలు విజయవంతమైతే 2014 డిసెంబరులో మొదలైన ‘ఆపరేషన్ రిజల్యూట్ సపోర్టు’ నుంచీ అమెరికా బయటపడే అవకాశం ఉంది. వాస్తవానికి 2001లో మొదలుపెట్టిన ‘ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్’ 2014లో ముగిసినా తాలిబన్లతో ఘర్షణలు ఆగలేదు. కాకపోతే 2014 నుంచి అమెరికా సైన్యానికి బదులు అఫ్గాన్ సైన్యం తాలిబన్లతో తలపడుతోంది. వారికి అవసరమైన మద్దతును అమెరికా ఇస్తోంది. ఇప్పుడు చర్చలు సఫలమైతే మొత్తం 18 ఏళ్ల భీకర ఘర్షణకు తెరపడుతుంది. ఈ ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆచితూచి స్పందించారు. అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా, మిత్రదేశాలకు ఉగ్రవాదం ముప్పు తొలగిపోయినప్పుడే విజయం సాధించనట్లని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాంపియో అనుకున్న విజయ తీరం కనుచూపు మేరలో కనిపించడంలేదు. మరోవైపు, చర్చల్లో తాలిబన్ ప్రతినిధిగా పాల్గొన్న షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ మాత్రం ‘ఇది విజయం సాధించిన రోజు’ అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్నారు. తాలిబన్లు దీన్ని ‘వ్యూహాత్మక ఒప్పందం’గానే చెప్పుకొంటున్నారని గార్డియన్‌వంటి పత్రికలు చెబుతున్నాయి.
అమెరికా ఆరాటం
వీలైనంత తొందరగా అఫ్గాన్ నుంచి బయటపడాలనే అమెరికా ఆరాటం ఈ ఒప్పందంలోని ప్రతి అక్షరంలో కనిపిస్తోంది. 14 నెలల్లో దళాలను పూర్తిగా ఉపసంహరించడంలో భాగంగా తొలి 135 రోజుల్లో అయిదు స్థావరాలను పూర్తిగా ఖాళీ చేసి 8,600 మంది అమెరికా, అదే స్థాయిలో సంకీర్ణ సేనలను వాపస్ తీసుకోవాలి. మే 29 నాటికి ఐరాస ఆంక్షలను, ఆగస్టు 27 నాటికి అమెరికా ఆంక్షలను తొలగించేలా కార్యాచరణ మొదలుపెట్టడం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఒప్పందం తొలిభాగంలో అమెరికా చేయాల్సిన పనులను ప్రస్తావిస్తూ ప్రతిదానికి కచ్చితమైన తేదీలతో సహా కాలావధిని నిర్ణయించారు. రెండో భాగంలో తాలిబన్లు చేయాల్సిన పనికి ఏ కొలమానం కనిపించదు. అమెరికా, మిత్రదేశాలకు ముప్పు కలిగించే అల్‌ఖైదా వంటి గ్రూపులను తాలిబన్లు నిరోధించడం, ఆశ్రయం కల్పించకపోవడం వంటివి చేయాలట. తాలిబన్లు రాజ్యం వదలుకొని మరీ అల్‌ఖైదాకు మద్దతుగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ట్రంప్‌కి మాత్రమే ఉపయోగపడే అల్‌ఖైదాను వదులుకుంటారా? రెండో భాగం అయిదో పాయింట్‌లో ఒక ప్రమాదకర సంకేతం ఉంది. అమెరికా మిత్రదేశాలకు ముప్పు కలిగించేవారికి తాలిబన్లు వీసాలు, పాస్‌పోర్టులు, ట్రావెల్ పర్మిట్లు ఇవ్వకూడదని పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో అఫ్గాన్‌లో తాలిబన్ పాలన ఖాయమని పరోక్షంగా అమెరికా అంగీకరించినట్లే! తాలిబన్లు తమకు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌గా చెప్పుకొనే ప్రయత్నం చేయగా అమెరికా కిందా మీదా పడి అడ్డుకోవాల్సి వచ్చింది.
ఒప్పందంలో షరతులు అమలు చేయకపోతే తాము మళ్లీ రంగంలోకి దిగుతామని అమెరికా చెప్పడం, ఒప్పందం అమలుకు 14నెలల గడువు నిర్ణయించడం ఊరట కలిగించే అంశాలు. ఈ లోపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిస్తే అమెరికా నాయకత్వం రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడి నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందంపై మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్‌బోల్టన్ వంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కూడా శాంతి ఒప్పందానికి మరో అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో అష్రఫ్ ఘనీ 50.64 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించినా, ఈ విజయాన్ని 39.52 శాతం ఓట్లు వచ్చిన ఆయన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా అంగీకరించలేదు. గత ఎన్నికల్లో ఇలాంటి సమస్యే వస్తే ఘనీని అధ్యక్షుడిగా, అబ్దుల్లాను చీఫ్ ఎగ్జిక్యుటివ్‌గా ఉండేందుకు అమెరికా ఒప్పించింది. కానీ, ఈసారి అమెరికా తాలిబన్లతో చర్చల్లో తలమునకలుగా ఉంది. తాలిబన్లతో చర్చలు ముగిసేవరకు రాజకీయాలు పక్కనపెట్టాలని అమెరికా, రష్యా వంటి దేశాలు వారికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఘనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ శాంతి చర్చల విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం రాకపోతే సమస్య మొదటికొచ్చే ప్రమాదం ఉంది.