తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ భారత పర్యటన విజయవంతమవుతుంది.. కానీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. భారత పర్యటన ఫలప్రదంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన విజయవంతంగా ముగుస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఇరుదేశాల వివాదాలు పరిష్కారం అవుతాయో లేదో అన్న విషయంలో స్పష్టత లేదని చెబుతున్నారు. ఇరుదేశాలు వాణిజ్యం, రక్షణ రంగాలకే పరిమితం కాకుండా వ్యూహాత్మక రంగాలపైనా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

Trump's India visit
అమెరికా

By

Published : Feb 15, 2020, 10:18 AM IST

Updated : Mar 1, 2020, 9:44 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటన చేపట్టనున్నారు. అభిశంసన ప్రక్రియ తర్వాత ట్రంప్ చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే. వ్యూహాత్మకంగా, ద్వైపాక్షికంగా ఈ పర్యటనపై ఇరుదేశాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పర్యటన సంపూర్ణ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్​ పర్యటన విజయవంతం అవుతుందని టాటా వ్యూహాత్మక సంబంధాల విభాగ చైర్మన్ ఆశ్లే టెల్లిస్ తెలిపారు. అయితే వాణిజ్య వివాదాలు పరిష్కారం అవుతాయో లేదో అన్న విషయంలో స్పష్టత లేదని చెప్పారు.

"ఒప్పందానికి ఇరు పక్షాలు సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... ఆ విషయంలో పురోగతి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ చర్యలు అమెరికా వాణిజ్య ప్రతినిధులను సంతృప్తిపరచలేవు. రక్షణ ఉత్పత్తులకు సంబంధించి ఏదైనా పురోగతి ఉండొచ్చు. కానీ అది కూడా అనిశ్చితిగానే ఉంది.

ట్రంప్ హయాంలో ఇరు దేశాలు రక్షణ రంగంలో సహకారం అందించుకున్నాయి. ఇది మరిన్ని సంవత్సరాలు కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఈ పర్యటన మంచి ఫలితాలు ఉత్పన్నం చేసినా... భారత్​ పట్ల స్నేహభావాన్ని ట్రంప్​ మరింత పెంచుకున్నట్లే నేను భావిస్తా. ట్రంప్​ పాదరస వ్యక్తిత్వం సహా ఆయన విధానాలను బట్టి చూస్తే ఇది చాలా పెద్ద విజయమే. ఈ విషయం ప్రధాని మోదీకి అర్థమయ్యే ఉంటుంది."-టెల్లీస్, టాటా వ్యూహాత్మక సంబంధాల విభాగ చైర్మన్

ఇద్దరికీ ముఖ్యమే

దేశాధినేతలిద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి ఇరు దేశాల మధ్య ఇటీవల చేసుకున్న వాణిజ్య విభేదాలను స్వల్పంగా తగ్గించుకుంటారని భావిస్తున్నట్లు 'సెంటర్​ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్'​లోని భారత్-అమెరికా విధాన పరిశోధన విభాగం ఛైర్మన్ రిక్​ రూసో తెలిపారు.

"ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​లో కస్టమ్స్​ సుంకాల పెంపు వంటి వాటి వల్ల ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను పెంచే విధంగా భారత్​ ప్రవర్తిస్తోంది. తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడం అంటే వాణిజ్య చికాకులను వాయిదా వేసుకున్నట్లే. ఎగుమతుల మార్కెట్​ సహా భద్రతాపరమైన భాగస్వామిగా అమెరికాకు భారత్ ఓ మంచి అవకాశం. అఫ్గానిస్థాన్​లో అమెరికా బలగాలను మరింతగా పెంచుకోవాలన్నా.. చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలన్నా భారత్ చాలా ముఖ్యం."-రిక్ రూసో, భారత్-అమెరికా విధాన పరిశోధన విభాగం ఛైర్మన్, సెంటర్​ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్​

వ్యూహాత్మకం!

ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడం సహా ఇరుదేశాల మధ్య దీర్ఘ కాల విధివిధానాలను కొనసాగించడానికి ట్రంప్ పర్యటన దోహదం చేస్తుందని శ్వేతసౌధ మాజీ అధికారి అనీశ్ గోయల్ అభిప్రాయపడ్డారు.

"ఈ పర్యటన అధ్యక్షుడు ట్రంప్​తో పాటు మోదీకీ రాజకీయ వరం లాంటిది. ట్రంప్​పై అభిమానం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అందువల్ల అహ్మదాబాద్ ర్యాలీలో చాలా మంది వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మోదీ సైతం అధ్యక్షుడికి ఇచ్చే ఆతిథ్యం ద్వారా మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న ఏడాదిలో ఈ పర్యటన చేపట్టడం వల్ల దీనికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. రక్షణ ఒప్పందాలకు ఈ పర్యటన చాలా ప్రత్యేకం. ఈ పర్యటనలో 3.5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లపై సంతకం చేయనున్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటించింది. భారత్-అమెరికాల బంధం కేవలం వాణిజ్యం, రక్షణ రంగాలకే పరిమితం కాకుండా వ్యూహాత్మక సంబంధాలపైనా దృష్టిసారించాలి."-అనీశ్ గోయల్, శ్వేత సౌధ మాజీ సీనియర్ అధికారి.

Last Updated : Mar 1, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details