అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే తీర్మానం మంగళవారం(ఫిబ్రవరి 9) సెనేట్ ముందుకు రానుంది. అభిశంసనతో పాటు నేర విచారణ కూడా అదే రోజున ప్రారంభంకానుంది.
చట్టసభల నిలయమైన క్యాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగేలా తన మద్దతుదార్లను రెచ్చగొట్టారన్నది ట్రంప్‌పై ఉన్న ఏకైక ఆరోపణ. ప్రతినిధుల సభకు కేవలం అభిశంసించే అధికారం ఉండగా.. సెనేట్‌కు విచారణ జరిపి, శిక్ష విధించే అధికారం కూడా ఉంది.
క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ సొంతపార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులు అప్పట్లో ఖండించగా, ప్రస్తుతం వారు మెత్తపడ్డారు. పదవి నుంచి దిగిపోయినందున మళ్లీ శిక్ష ఎందుకున్న భావన వారిలో ఉంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసేందుకే చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం మరికొందరిలో ఉంది.
అధికారంలో ఉన్నప్పుడయితే విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్వర్యం వహిస్తారు. ప్రస్తుతం పదవిలో లేనందున అధికార పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీలో అత్యంత సీనియర్ సభ్యుడైన పాట్రిక్ లీహీ ఆధ్వర్యం వహిస్తారు. విచారణ ఎన్నిరోజులు జరగాలన్నదానిపై నిర్ణీత కాలపరిమితి అంటూ ఏమీ లేదు. పదవిలో లేనివారిపై విచారణ జరపడం రాజ్యంగ విరుద్ధమని కొందరు వాదిస్తుండగా.. మరికొందరు దీన్ని కొట్టిపారేస్తున్నారు.
ఇదీ చూడండి:-ట్రంప్‌కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్