తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్‌ భాష వల్లే భారతీయ- అమెరికన్లపై దాడులు' - అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై విమర్శలు గుప్పిస్తూనే.. ప్రవాస భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. అధ్యక్షుడు వలసదారుల పట్ల ఉపయోగించే ప్రమాదకరమైన భాషే.. భారతీయ-అమెరికన్లపై ద్వేషపూరిత దాడులకు ఆజ్యం పోశాయన్నారు. శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వారు, చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటున్న వారు ట్రంప్‌ నిర్ణయాలకు బలైపోతున్నారని పేర్కొన్నారు.

Joe Biden
డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

By

Published : Oct 24, 2020, 2:36 PM IST

అమెరికా ఎన్నికలు దగ్గపడుతున్న తరుణంలో భారతీయ అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు భారతీయులు, భారత్‌ పట్ల ఆయనకున్న మక్కువను తెలిజేస్తూ ఓ ప్రధాన పత్రికలో వ్యాసం రాశారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ గొప్పతనాన్ని ఈ సందర్భంగా బైడెన్‌ హైలైట్‌ చేసే ప్రయత్నం చేశారు.

పెద్దలు, కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, ప్రతిఒక్కరినీ గౌరవించడం, స్వీయ క్రమశిక్షణ, సేవ, కష్టపడేతత్వం వంటి లక్షణాలు భారతీయ అమెరికన్లను తనకు దగ్గర చేశాయని జో బైడెన్‌ తెలిపారు. అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఐర్లాండ్‌ నుంచి వచ్చిన తన పూర్వీకుల నుంచి తనకూ ఈ విలువలు అందాయని చెప్పారు. ఆ విలువలే తనని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాయని చెప్పుకొచ్చారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన నివాసంలో జరిపిన దీపావళి వేడుకను ఈ సందర్భంగా బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్న దాదాపు రెండు మిలియన్ల మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లను బైడెన్‌ లక్ష్యంగా చేసుకున్నారు. ఉత్తర కరోలినా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగన్‌, జార్జియా, టెక్సాస్‌ రాష్ట్రాల్లో ఇండియన్‌ అమెరికన్‌ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.

అధ్యక్షుడి తీరుతో తీరని నష్టం..

ఇక్కడి భారతీయులతో తనకు గాఢమైన అనుబంధం ఉందని బైడన్‌ అన్నారు. వారి విలువలు, తమ విలువలతో సరిపోలతాయని వివరించారు. ఇక విలువలే లేని డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిత్వం కారణంగా.. అమెరికా తామందరం కలలుకన్న మాదిరిగా లేకుండా పోయిందని అయన విచారం వ్యక్తంచేశారు. మహమ్మారి కరోనా విషయంలో కూడా అధ్యక్షుడు అనాలోచితంగా వ్యవహరించి.. డాక్టర్‌ ఫౌచీ వంటి నిపుణుల సూచనలను పెడచెవిన పెట్టారన్నారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారి.. అనేక మంది అమెరికన్లు ప్రాణాలు, ఉపాధిని కోల్పోయారన్నారు.

కమలా హారిస్​పై ప్రశంసలు..

ఈ సందర్భంగా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై బైడెన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఎప్పుడూ సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండే తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చెన్నైకు చెందిన కమల తాత భారత జాతీయోద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తన తల్లి చేతులు పట్టుకొని ఉన్న చిన్ననాటి ఫొటోని కమలా తరచూ షేర్‌ చేస్తుంటారని తెలిపారు. ఆ చిత్రం వారి ధైర్యం, ఆశ, త్యాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు. ఆమె గురించి మాట్లాడినప్పుడు భారతీయులంతా పులకించిపోతారని అభిప్రాయపడ్డారు. కమలా అనుభవించిన జీవితమే ఇక్కడ ప్రతి భారతీయ అమెరికన్‌ అనుభవిస్తున్నారని తెలిపారు.

ప్రవాస భారతీయులపై దాడులకు ఆజ్యం..

ట్రంప్‌ వలసదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధ్యక్షుడు వలసదారుల పట్ల ఉపయోగించే ప్రమాదకరమైన భాషే.. భారతీయ-అమెరికన్లపై ద్వేషపూరిత దాడులకు ఆజ్యం పోశాయన్నారు. శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వారు, చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటున్న వారు ట్రంప్‌ నిర్ణయాలకు బలైపోతున్నారన్నారు.

చైనా విషయంలోనూ భారత్‌కు అండగా ఉంటామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడతామన్నారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంక్షోభం, ఉగ్రవాదం, అణుముప్పు వంటి సవాళ్లను కలిసి సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​- బైడెన్​ గ్రాఫ్​లో మార్పు... తేడా 4 పాయింట్లే!

ABOUT THE AUTHOR

...view details