తెలంగాణ

telangana

ETV Bharat / international

పౌరులపైకి సైన్యమా? ట్రంప్‌ వైఖరి వివాదాస్పదం - us protests updates

అమెరికాలో నిరసనలను నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతానని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సొంత పౌరులను కట్టడి చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

trump's army decision becoming controversial
పౌరులపైకి సైన్యమా? వివాదాస్పదమవుతున్న ట్రంప్‌ వైఖరి

By

Published : Jun 3, 2020, 6:50 AM IST

అమెరికాలో ఎగిసిపడుతున్న నిరసనలను నియంత్రించే విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తున్న తీరు ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. నిరసనకారులను ‘థగ్స్‌’గా అభివర్ణించడం, లూటీలు మొదలయితే కాల్పులూ జరుగుతాయని హెచ్చరించడంపై అక్కడి ప్రముఖుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. రాష్ట్రాల గవర్నర్లందరినీ ఆయన బలహీనులుగా పేర్కొన్నారు. నిరసనలను అణచివేయడానికి నేషనల్‌గార్డ్స్‌ను రంగంలోకి దించాలని వారిని ఆదేశించారు. నేషనల్‌గార్డ్స్‌ను సరిగా వినియోగించలేకపోతే పూర్తిస్థాయి సైన్యాన్ని మోహరిస్తానని తాజాగా హెచ్చరించారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న సొంత పౌరులను కట్టడి చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించడమేమిటన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

సైన్యాన్ని రంగంలోకి దించవచ్చా?

ఏ రాష్ట్రంలోనైనా తిరుగుబాట్లు, హింసాత్మక సంఘటనలు, కుట్ర వంటివి జరుగుతుంటే సైన్యాన్ని పంపే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అయితే అరెస్టులు, ఆస్తుల జప్తు, సోదాలు నిర్వహించడం వంటి స్థానిక పోలీస్‌ చర్యలను ఫెడరల్‌ బలగాలు చేపట్టకుండా 1878 నాటి పొసే కమిటాటస్‌ చట్టం నిషేధిస్తోంది. గవర్నర్‌ కోరితేనే బలగాలను పంపించాల్సి ఉంటుందన్న వాదనా ఉంది. సైన్యాన్ని రంగంలోకి దించాలని తాను కోరబోనని ఇలినాయిస్‌ గవర్నర్‌ జె.బి.ప్రిట్జ్‌కర్‌ స్పష్టం చేశారు.

ఎప్పుడైనా ఉపయోగించారా?

స్థానికంగా సైనిక బలగాలను రంగంలోకి దించడం అరుదైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ పని చేశారు. చివరిసారిగా 1992లో లాస్‌ఏంజెలిస్‌లో అల్లర్లను అదుపు చేయడానికి సైన్యాన్ని పంపించారు. 1991లో రోడ్నీ కింగ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ను పోలీసులు క్రూరంగా కొట్టారు. నాటి ఘటనలో పోలీసులను తర్వాతి సంవత్సరం కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అక్కడ తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 50 మంది చనిపోయారు. సైన్యం వెళ్లేటప్పటికే నేషనల్‌ గార్డ్స్‌ సహాయంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

‘నేషనల్‌గార్డ్స్‌’ ఎవరు?

నేషనల్‌గార్డ్స్‌.. అమెరికా సైన్యంలో ఒక ప్రత్యేక భాగమైనప్పటికీ పూర్తిస్థాయి సైన్యం కాదు. ప్రజలకు, దేశానికి సేవ చేయడమే ఆ విభాగం కర్తవ్యంగా చెబుతారు. ప్రకృతి విపత్తుల సమయంలో సేవలందింస్తుంటారు. ఇందులో ఉండేది ఎక్కువగా పౌరులే. ప్రతిఏటా వారికి శిక్షణ కూడా ఇస్తారు. సాధారణంగా వారు రాష్ట్రాల గవర్నర్ల అధీనంలో పని చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో సైన్యానికి తోడ్పాటుగా పిలిపించుకోవచ్చు. అధ్యక్షుడు పూర్తిగా తన అధీనంలో ఉంచుకోవచ్చు. శాంతిభద్రతల సమస్య ఎదురయినప్పుడు వారు పోలీసులకు సహకరిస్తుంటారు. నిరసనలు ఎగిసిపడుతున్న ప్రస్తుత సమయంలో వారు పోలీసులకు సహకరించే విధుల్లో ఉన్నారు. ఆయుధాలనూ కలిగి ఉంటారు. పౌరులను అరెస్టు చేసే, నిర్బంధించే హక్కు తమకు లేదని, అయితే సైనికులకు ఆత్మరక్షణ హక్కు ఉన్నందున ఆయుధాలు ధరిస్తామని మిన్నెసోట నేషనల్‌గార్డ్స్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ జాన్‌ జెన్సెన్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details