అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విరోధులు ఎక్కువే! గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చవిచూసినా.. ట్రంప్‌పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. అందుకే టెక్సాస్‌లోని లూయిస్ టుస్సాడ్స్ వ్యాక్స్వర్క్స్లో ఉన్న ట్రంప్ మైనపు విగ్రహంపై అక్కడికి వచ్చే కస్టమర్లు పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ విగ్రహం మొహం భాగంపై పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ట్రంప్ మైనపు బొమ్మ మొహంపై గాట్లు పడ్డాయి. చేసేదేమీ లేక విగ్రహాన్ని వేరే చోటకు తరలించారు నిర్వాహకులు.
లూయిస్ టుస్సాడ్స్ వర్క్స్‌ను 'రిప్లే ఎంటర్టైన్మెంట్స్' నిర్వహిస్తోంది. అధ్యక్ష విగ్రహాలు ఉండే విభాగంలో తమకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురవుతునే ఉన్నాయని ఆ సంస్థ మేనేజర్ స్టివర్ట్ తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షులు బుష్, ఒబామాల విగ్రహాలపై గతంలో ఇలాంటి దాడులు జరిగాయని వివరించారు. ఒబమా మైనపు విగ్రహం చెవులు 6సార్లు పోయాయని, జార్జ్ వాషింగ్టన్ బుష్ విగ్రహం ముక్కును విరగ్గొట్టారని వివరించారు. నేతలను రాజకీయంగా విభేదించే వారు ఆగ్రహావేశాలతో ఇలాంటి దాడులకు పాల్పడుతారని చెప్పారు.