అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని చైనాను మరోమారు హెచ్చరించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సెప్టెంబర్లో జరగబోయే వాణిజ్య చర్చల్లో.. ఒప్పందం కుదరకపోతే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచుతామని పేర్కొన్నారు.
300 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తరువాతే ఈ మేరకు హెచ్చరించారు ట్రంప్. పెంచిన సుంకాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని వెల్లడించారు.
"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగేందుకు చైనా చాలా చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి చాలా జరగబోతున్నాయి. స్పష్టంగా చెబుతున్నా... ఒకవేళ వారు ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఎల్లప్పుడూ గణనీయంగా సుంకాలు పెంచుతూ పోతాను. నేను కావాలనుకుంటే పెద్ద మొత్తంలో పెంచుతాను."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు