అమెరికా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ల మధ్య రెండో సంవాదానికి రంగం సిద్ధమైంది. టెన్నెసీ నగరం వేదికగా మరికాసేపట్లో ఈ ముఖాముఖి సమరం మొదలవనుంది. ఎన్నికలకు 12 రోజులు మిగిలి ఉన్న ప్రస్తుత సమయంలో ఇరువురు అభ్యర్థులకు ఈ డిబేట్ కీలకం కానుంది. భారత కాలామానం ప్రకారం శుక్రవారం ఉదయం 6.30గంటలకు డిబేట్ ప్రారంభం కానుంది.
అయితే ఈ చర్చ ప్రారంభానికి ముందు అమెరికా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశీలకుల మెదళ్లను ఐదు ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అవేంటో చూద్దాం.
1. ఎన్నికల పోటీలో ప్రస్తుత పరిస్థితిని ట్రంప్ మార్చగలరా?
ఇప్పటికే ఒకసారి జరిగిన డిబేట్ సహా ప్రచారంలో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ ముందున్నట్లు తెలుస్తోంది. జాతీయ సర్వేలు బైడెన్‌కే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ భారీ మెజార్టీతో ఓటమి చవిచూస్తారని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ఓటమి చెందుతారని సొంత పార్టీ నేతలే కలవరపడుతున్నారు. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ముందున్న ఏకైక, అత్యుత్తమ అవకాశం ఈ డిబేట్. లక్షల మంది అమెరికన్లు చూసే ఈ డిబేట్లో ట్రంప్ చేసే ప్రతీ వ్యాఖ్య పోటీ గమనంపై ప్రభావం చూపించగలదు.
మొదటి డిబేట్లో పూర్తిగా దూకుడు వైఖరి అవలంబించి ట్రంప్ బోల్తా కొట్టారు. బైడెన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. ట్రంప్ కరోనా బారిన పడ్డ నేపథ్యంలో రెండో డిబేట్‌ను వర్చువల్‌గా జరిపించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ ఓ మంచి అవకాశాన్ని కోల్పోయారు.
కాబట్టి ప్రస్తుత చర్చపైనే ట్రంప్ ప్రధానంగా దృష్టిపెట్టాలి. బైడెన్ ప్రతికూలతలను ఎత్తి చూపాలి. ఇలా చేయాలంటే తానే చర్చకు కేంద్ర బిందువు అనే భావన నుంచి బయటకు రావాలి. ఇది అధ్యక్షుడికి సహజంగా లేని లక్షణం.
2. మ్యూట్ బటన్‌తో డిబేట్ సాఫీగా జరుగుతుందా?
తొలి సంవాదంలో నేతలిద్దరు ఒకరికొకరు అంతరాయాలు కలిగించుకోవడం వల్ల తాజా చర్చలో మ్యూట్ బటన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిబేట్ కమిషన్ ప్రకటించింది. ఈ విషయం అందరి దృష్టి ఆకర్షించింది. అయితే దీని ప్రభావం గురించి అతి చేసి చూపిస్తున్నారు. ఇది పెద్దగా ప్రయోజనం కలిగిస్తుందన్న నమ్మకం లేదు.
డిబేట్ మొత్తం నిడివి 90 నిమిషాలు. ఇందులో నిర్వాహకులు అడిగే ఆరు ప్రశ్నలకు ఇరువురు నేతలు రెండు నిమిషాల చొప్పున తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఈ సమయంలో ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరి మైక్ పనిచేయదు. దీని వల్ల అభ్యర్థులు ఎలాంటి అంతరాయం లేకుండా తమ అభిప్రాయాలు చెప్పగలుగుతారు. కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పే 24 నిమిషాల సమయంలో మాత్రమే మ్యూట్ బటన్‌ను ఉపయోగించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. మిగిలిన సమయంలో జరిగే బహిరంగ చర్చలో దీని ఉపయోగించరు. కాబట్టి అభ్యర్థుల మధ్య రసాభాస జరిగేందుకు చాలినంత సమయం ఉంటుంది.
3. మహమ్మారి విషయంలో ట్రంప్ వద్ద సరైన సమాధానం ఉందా?
ట్రంప్ కోరుకున్నా, కోరుకోకపోయినా.. కరోనావైరస్ గురించి సుదీర్ఘంగా మాట్లాడి తీరాల్సిందే. తొలి సంవాదంలో జరిగినట్లు కాకుండా ఈసారి మరింత ఉత్తమమైన సమాధానంతో ప్రజల ముందుకు రావాల్సిందే. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలకు విడమరచి చెప్పాల్సిందే. కానీ, ఇదంత సులభం కాదు.
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2.2 లక్షల మందికిపైగా ఈ వైరస్‌కు బలయ్యారు. సమగ్రమైన ప్రణాళిక రచించుకొని ముందుకెళ్లాల్సిన అధ్యక్షుడు ట్రంప్.. అవన్నీ పక్కనబెట్టి తన సొంత యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారు. దేశ ప్రజలంతా గౌరవించే ప్రముఖ అంటువ్యాధుల శాస్త్ర నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ లక్ష్యంగా విమర్శలు చేశారు. మాస్కులు ధరించడాన్ని తక్కువ చేసి చూశారు.
తొలి సంవాదంలో భాగంగా.. ఎన్నో నెలల క్రితం తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పుకొచ్చారు ట్రంప్. చైనా ప్రయాణాలపై ఆంక్షలు విధించామని అన్నారు. ఉత్తమంగా పనిచేస్తున్నాం అని సమర్థించుకున్నారు. మహమ్మారి తీవ్రతను తక్కువ చేసి చూపించే గణాంకాలను ఉపయోగించుకున్నారు. అయితే ప్రజలను నమ్మించేందుకు మరింత మెరుగైన విషయాలతో రావాల్సి ఉంటుంది.
4. కుమారుడికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలపై బైడెన్ ఎలా వ్యవహరిస్తారు?
ట్రంప్‌తో పాటు తన మద్దతుదారులు, కొన్ని మీడియా సంస్థలు బైడెన్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రధాన వ్యూహంగా మలుచుకొని ట్రంప్ డిబేట్ బరిలో దిగుతారని బైడెన్ బృందం భావిస్తోంది.
బైడెన్ తనయుడు హంటర్ మాదక ద్రవ్యాలు వినియోగించడంపైనా అధ్యక్షుడు ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయాన్ని హంటర్ ఇదివరకే బహిరంగంగా ఒప్పుకున్నారు. బైడెన్ సైతం ఈ విషయంపై హుందాగా స్పందించారు. చాలా మంది అమెరికన్ల మాదిరిగానే ఈ వ్యసనం నుంచి హంటర్ బయటపడ్డారని బైడెన్ పేర్కొన్నారు. తన కుమారుడి పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది.
అయితే ట్రంప్ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయి. విదేశాల్లో హంటర్ పనితీరుపై ఇటీవలే ఓ పత్రిక ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన గ్యాస్ కంపెనీ 'బురిస్మా' అధికారి ఒకరు హంటర్‌కు పంపిన ఈమెయిల్‌ను న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టింది. 2015లో వాషింగ్టన్ పర్యటనలో బైడెన్‌ను కలిసేందుకు హంటర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆ ఈమెయిల్ వచ్చిందని పేర్కొంది. ఈ వివరాలు హంటర్ ల్యాప్‌టాప్ నుంచే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ వివరాలేవీ నిర్ధరణ కాలేదు. ఒకవేళ నిర్ధరణ అయినా.. జో బైడెన్‌కు వీటికి సంబంధం ఉండకపోవచ్చు.
మరోవైపు, బైడెన్ షెడ్యూల్లో అలాంటి సమావేశం ఏదీ జరగలేదని డెమొక్రాటిక్ పార్టీ చెబుతోంది. దేశంలోని ప్రధాన సమస్యలతో పోలిస్తే వీటి ప్రభావం తక్కువేనని బైడెన్ బృందం భావిస్తోంది. అయినప్పటికీ బైడెన్ గురువారం సైతం తనను తాను సమర్థించుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
5. బైడెన్.. రిపబ్లికన్ పార్టీ ఉచ్చులో పడకుండా ఉంటారా?
చివరి డిబేట్లో బైడెన్‌కు బైడెనే తొలి ప్రత్యర్థి. బైడెన్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసేందుకు ట్రంప్ దగ్గర సమర్థమంతమైన అంశాలు లేవు. అనుకోకుండా చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్లే బైడెన్ ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇలాంటి విషయాలతో బైడెన్‌ను ప్రత్యర్థులు అపహస్యం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. దాదాపు సంవత్సరం నుంచి బైడెన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ట్రంప్ మద్దతుదారులు విమర్శలు చేస్తూ ఉన్నారు.
తొలి సంవాదంలో ఈ అనుమానాలను బైడెన్ పటాపంచలు చేసినా.. ఇవి అంత తేలికగా వదిలే సమస్యలు కావు. దేశాన్ని నడిపించేందుకు బైడెన్ మానసికంగా సిద్ధంగా లేరని రిపబ్లికన్ పార్టీ చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి. గత నాలుగు రోజులుగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో బైడెన్ పాల్గొనడం లేదు. కాబట్టి సంవాదంపై బైడెన్ పూర్తిగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ బైడెన్ పొరపాట్లు డెమొక్రాటిక్ పార్టీని ఇబ్బంది పెట్టిన దాఖలాలు గతంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆ పార్టీ వైఖరి ఆందోళనకరంగానే ఉంది. తొలి సంవాదంలో ట్రంప్ బలహీన ప్రదర్శన తర్వాత బైడెన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇది బైడెన్‌కు ఏమాత్రం కలిసొచ్చే విషయం కాదు. కాబట్టి బైడెన్ చాలా జాగ్రత్త వహించాలి.
ప్రశ్నల సంగతి పక్కనబెడితే...
చివరి సంవాదంలో విదేశాంగ విధానం కేంద్రంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ విధానంలో ట్రంప్, బైడెన్ పూర్తి భిన్నవైఖరి అవలంబిస్తున్నారు. ఇతర దేశాలు అమెరికా ప్రయోజనాలను కొల్లగొట్టే శకానికి ముగింపు పలుకుతూ ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానాన్ని ముందుకేసుకున్నారు. తన తొలి పాలనలోనూ ఇదే వైఖరి పాటించారు.
మరోవైపు, ప్రపంచంతో కలిసి నడిచేలా బైడెన్ అడుగులు వేస్తున్నారు. పశ్చిమాన ఉన్న ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలు పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తున్నారు. తమ తొలి ప్రాధాన్యం మాత్రం దేశ భద్రతేనని స్పష్టం చేస్తున్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తోందని.. దాన్ని పరిష్కరించడమే తమ ప్రాధాన్యాంశమని చెబుతున్నారు.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు, వాతావరణ ఒప్పందాల నుంచి వైదొలగడం, నాటో కూటమి దేశాలను విమర్శించడం, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లతో సన్నిహితంగా ఉండటాన్ని బైడెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అధికారంలోకి వస్తే అమెరికాకు ఉన్న సంబంధాలను పునరుద్ధరిస్తానని బైడెన్ హామీ ఇస్తున్నారు. దశాబ్దం పాటు సెనేటర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించడం సహా రెండు సార్లు ఉపాధ్యక్ష పదవిలో ఉన్న అనుభవాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. అస్థిరంగా మారిపోయిన అమెరికా సంబంధాలను చక్కదిద్దేందుకు తొలి రోజు నుంచే పనిచేస్తానని చెబుతున్నారు. అయితే కరోనా సమయంలో అమెరికాను ఎలా నడిపిస్తారనే విషయంలో బైడెన్ విదేశాంగ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రంప్ విజయాలు
మరోవైపు తన విధానాన్ని పూర్తిగా వెనకేసుకొస్తున్నారు ట్రంప్. అమెరికా ఫస్ట్ అనేది నినాదానికే పరిమితం కాలేదని స్పష్టం చేస్తున్నారు. నాఫ్టా(దక్షిణ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం)ను అనుకూలంగా మలిచానని చెబుతున్నారు. చట్టపరమైన వలసలను తగ్గించడం తన విజయంగా భావిస్తున్నారు. పన్నులను తగ్గించడం, చైనాతో రాజీలేని వర్తకం సాగించడాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా కార్మికులకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
అయితే ట్రంప్ ఖాతాలో ఉన్న కొన్ని విజయాలు ఆయనకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. నాఫ్టా ఒప్పందం విషయంలో అమెరికా కాంగ్రెస్ ఆయనకు మద్దతిచ్చింది. తాజాగా పశ్చిమాసియాలో అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ ఒప్పందాలు ఆయన విదేశాంగ విధానానికి దక్కిన విజయాలే. కానీ ఇరాన్ అణు సమస్య, సిరియాలో యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భూవివాదం వంటి సమస్యలను ట్రంప్ పరిష్కరించలేకపోయారు.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని బైడెన్ వాగ్దానం చేస్తున్నారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరడం సహా అమెరికా నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. ముస్లిం దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలిస్తానని హామీ ఇచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని చెప్తున్నారు. విదేశాలకు అందించే సహాయ కార్యక్రమాలను పునరుద్ధరించడంతో పాటు 2016 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు.
చివరగా..
ఇప్పటికే చాలా మంది అమెరికన్లు ముందస్తుగానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారిక ఎన్నికల తేదీకి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జరగనున్న డిబేట్ ఇరువురికీ ఎంతో కీలకం కానుంది.